రాజాం సిటీ: తాను ప్రయాణిస్తున్న బస్సులో బంగారం, నగదుతో ఉన్న బ్యాగు పోయిన విషయాన్ని గుర్తించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోయిన బ్యాగును సీసీ కెమెరాల ఆధారంగా రికవరీ చేసిన రాజాం పోలీసులు బాధితుడికి మంగళవారం అప్పగించారు. దీనిపై టౌన్ సీఐ డి.నవీన్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన గిరడ సుధాకర్ వినాయక చవితి సందర్భంగా కుటుంబసభ్యులతోపాటు ఈ నెల 12న విశాఖపట్నం నుంచి స్వగ్రామం బస్సులో బయల్దేరాడు. తన బట్టల బ్యాగులో సుమారు రూ.లక్ష విలువచేసే ఏడు గ్రాముల చెవిదిద్దులు, బంగారు ఉంగరం, రూ.2,200 నగదు ఉంచాడు. ఆ బ్యాగును తన సీటుపైన ఉన్న సెల్ఫ్‌లో పెట్టి ప్రయాణిస్తున్నాడు. రాజాం మండలం గురవాం సమీపంలోకి వెళ్లేసరికి బ్యాగు చూడగా కనిపించకపోవడంతో ఆందోళనకు గురై వెంటనే అక్కడి నుంచి రాజాం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీ టీవీల ఆధారంగా బ్యాగు పట్టుకుపోయిన వ్యక్తిని గుర్తించి బ్యాగుతోపాటు అందులోని బంగారం, డబ్బులు రికవరీ చేసి సంబంధిత బాధితునికి మంగళవారం అప్పగించామని సీఐ తెలిపారు.


