విజయనగరం గంటస్తంభం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సేకరించిన ఫారం – 6, 7, 8లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఫారంలోని వివరాలు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో సిహెచ్.సత్తిబాబు, పర్యవేక్షకులు ప్రసాద్ పాల్గొన్నారు.
రీసర్వే పనుల వేగం పెంచాలి : జేసీ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో చేపట్టిన భూ రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, 22 ఎ దరఖాస్తుల పరిష్కారం తదితర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రికార్డుల డిజిటలైజేషన్, రెవెన్యూ వన్, పీజీఆర్‌ఎస్ తదితర అంశాల పురోగతిపై ఈ సందర్భంగా సమగ్ర సమీక్ష సాగింది. అనంతరం జేసీ రెవెన్యూ అధికారులతో సమీక్షిస్తూ.. రీసర్వేకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. 22 ఎ కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించి ప్రజలకు సంతృప్తికరమైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
సీబీడీసీతో సురక్షితమైన లావాదేవీలు
విజయనగరం ఫోర్ట్: ప్రజా పంపిణీ వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా సురక్షితమైన తక్షణ ట్రేసబుల్ డిజిటల్ లావాదేవీలకు అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అన్నారు. పౌర సరఫరాల అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రేషన్ షాపుల డీలర్ల వివరాల ధ్రువీకరణ, ఈకేవైసీ పూర్తి, బ్యాంకు ఖాతాల సిద్ధత, డీలర్లను సీబీడీసీ ఫ్లాట్‌ఫారంలో నమోదు, మర్చంట్ వాలెట్ల ఏర్పాటు తదితర ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలోడీఎస్‌ఓ జి.మురిళీనాధ్ పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వాటా మొత్తం వాపస్
విజయనగరం అర్బన్: టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారుల వాటాగా గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు 543 మంది లబ్ధిదారులకు రూ.93.98 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2017, 2018 సంవత్సరాల్లో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని లబ్ధిదారుల వాటా చెల్లించినప్పటికీ ఇళ్లు కేటాయించని వారి మొత్తాలను తిరిగి చెల్లించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి 543 మంది లబ్ధిదారులకు రూ.93.98 లక్షలు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఈఈ ప్రసాద్, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


