● తహసీల్దార్ కుర్చీలో కూర్చుని
సమీక్షించిన ఎమ్మెల్యే కుమారుడు
● ఎమ్మెల్యే వస్తారని చెప్పడంతో
అధికారుల హాజరు
చీపురుపల్లి:
నియోజకవర్గ స్థాయిలో సమస్యలు, అత్యవసర పరిస్థితులపై ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షించడం సర్వసాధారణం. కానీ చీపురుపల్లిలో పరిస్థితులు అందుకు భిన్నం. ఎలాంటి పదవులు లేని, ప్రోటోకాల్ ఉండని వారు సైతం ఇక్కడ అధికారులతో సమీక్ష చేస్తుంటారు. ఇక్కడ అధికారులతో సమీక్షించడానికి ప్రజాప్రతినిధి కానక్కర్లేదు... టీడీపీలో పదవి ఉంటే చాలన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తుఫాన్‌పై జరిగిన సమీక్ష సమావేశం ఓ మచ్చుతునక. తుఫాన్ అప్రమత్తత చర్యల కోసం గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమీక్ష ఉందని అధికారుల గ్రూపులో సమాచారం పంపించారు. దీంతో మండల స్థాయి అధికారులంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశం ప్రారంభమయ్యే సరికి ఎమ్మెల్యే లేరు సరికదా.. ఆయన కుమారుడు రామ్‌మల్లిక్‌నాయుడు హాజరై ఏకంగా తహసీల్దార్ బంగార్రాజు కుర్చీలోనే ఆసీనులై సమీక్ష ప్రారంభించారు. పక్క కుర్చీలో తహసీల్దార్ కూర్చున్నారు. దీంతో హాజరైన అధికారులు నివ్వెరపోయారు. ఇదేమి పెత్తనమంటూ అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ఎంత అధికారం ఉంటే మాత్రం ఇలా... ఒక మండల మెజిస్ట్రేట్ కుర్చీలో కూర్చుని అధికారం చెలాయించడం తీవ్ర చర్చగా మారింది. ఇది సరికాదంటూ... పలువురు గుసగుసలాడుకున్నారు.


