మేయర్‌ రిజర్వేషన్‌ మళ్లీ బీసీకేనా? | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ రిజర్వేషన్‌ మళ్లీ బీసీకేనా?

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

ఎవరి లెక్కలు వారివే!

విజయనగరం అర్బన్‌: విజయనగర నగర పాలక సంస్థ ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ.. మేయర్‌ రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా 62 వార్డులు.. 2,23,050 మంది ఓటర్లు... వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల కేటగిరీల వారీగా గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇప్పుడు మేయర్‌ పీఠం ఏ సామాజిక వర్గానికి దక్కుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. తాజా కులాల వారీ ఓటర్ల లెక్కల్లో బీసీల సంఖ్య 50,786గా ఉంది. ఎస్సీలు 21,980 ఎస్టీలు 986 మంది కాగా, ఇతరుల కేటగిరీలో 1,49,298 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో బీసీల వాటా నుమారు 22.77 శాతం. అయితే, నగరంలోని ఈ గణాంకాల ఆధారంగానే మేయర్‌ రిజర్వేషన్‌ ఖరారయ్యే పరిస్థితి లేదు. మేయర్‌ పదవుల రిజర్వేషన్‌ రాష్ట్రంలోని కార్పొరేషన్లను యూనిట్‌గా తీసుకుని రొటేషన్‌ పద్ధతిలో నిర్ణయించనున్నారు.

● తొలి పీఠం బీసీ మహిళకే..

విజయనగరం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మేయర్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. 2021లో వైఎస్సార్‌సీపీకి చెందిన వెంపడాపు విజయలక్ష్మి తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో 50వార్డుల్లో 48 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు 50 వార్డుల స్థానంలో 62 వార్డులు వచ్చాయి. మేయర్‌ను కూడా ఈసారి కార్పొరేటర్లు కాకుండా నగర ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో రిజర్వేషన్‌ ఖరారైతే.. అది కేవలం కార్పొరేటర్ల సమీకరణాలకే కాకుండా నగరవ్యాప్తంగా జరిగే మేయర్‌ ఎన్నికకు కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అయితే, బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంతో మేయర్‌ పదవి బీసీకే వస్తుందని చెప్పలేం. గతంలో బీసీ మహిళకు కేటాయించిన రిజర్వేషన్‌ ఈసారి కొనసాగుతుందా? లేక రొటేషన్‌లో మరో కేటగిరీకి అవకాశం వస్తుందా? అన్నది ప్రభుత్వం జారీ చేసే తుది రిజర్వేషన్‌ నోటిఫికేషన్‌తోనే తేలనుంది.

నగరంలో 2.23 లక్షల మంది ఓటర్లలో బీసీలు 50,786

రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్‌ కేటాయింపు

62 వార్డుల కులాల జాబితాతో పెరిగిన రాజకీయ లెక్కలు

వార్డుల పునర్విభజన పూర్తయి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు తనదైన సామాజిక లెక్కలు వేసుకుంటోంది. బీసీ రిజర్వేషన్‌ వస్తే ఎవరిని తెరపైకి తేవాలి? మహిళా రిజర్వేషన్‌ అయితే ఏ కుటుంబానికి అవకాశం ఇవ్వాలి? జనరల్‌ కేటగిరీ అయితే ప్రధాన పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం దక్కాలి? అనే చర్చలు మొదలయ్యాయి. మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నిక కావడంతో రిజర్వేషన్‌ ప్రకటించకముందే ఆశావహుల సంఖ్య పెరిగింది. ఎవరికి వారే సన్నాహాలు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement