23లోగా పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

23లోగా పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

● జేసీ సేతుమాధవన్‌

విజయనగరం ఫోర్ట్‌: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఈనెల 23 లోగా పరిశీలన పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. సేతుమాధవన్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలన్నారు. అలాగే, ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలందరితో ఆల్బెండజోల్‌ మాత్రలు మింగించాలన్నారు. అక్టోబర్‌ 5న మాపప్‌ కార్యక్రమం కింద మిగిలిపోయిన వారందరితో మాత్రలు మింగించాలన్నారు. ఈనెల 24 వరకు కుష్ఠువ్యాధిగ్రస్తులను గుర్తించే ఇంటింటి సర్వే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై రూపొందించిన అవగాహన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో పీహెచ్‌.సత్తిబాబు, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పద్మజ, డీఎల్‌ఓ కె.రాణి, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన వర్సిటీని సందర్శించిన జర్నలిస్టుల బృందం

విజయనగరం రూరల్‌: కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించే లక్ష్యంతో కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యటిస్తున్న పంజాబ్‌ జర్నలిస్టుల బృందం ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సోమవారం సందర్శించింది. వర్సిటీ వీసీ టి.శ్రీనివాసన్‌, రిజిస్ట్రార్‌ జితేంద్రమోహన్‌ మిశ్రా, ఫైనాన్స్‌ అధికారి ఎం.శరత్‌చంద్రబాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందంతో పాత్రికేయుల బృందం ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి చర్చ నిర్వహించారు. వర్సిటీ పనితీరు, విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యావకాశాలు, ప్రాంతీయ ప్రజల అభ్యున్నతికి సంస్థ చేపడుతున్న విద్యా, పరిశోధనా పురోగతిని అధ్యాపక బృందం జర్నలిస్టులకు సమగ్రంగా వివరించింది. కార్యక్రమాన్ని వర్సిటీ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ ఇప్పిలి తారకేశ్వరరావు సమన్వయం చేశారు.

సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ

విజయనగరం టౌన్‌: కన్యాశుల్కం రచనతో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు అని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మహాకవి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని మూఢ నమ్మకాలు, అసమానతలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో సంస్కరణ భావాలను పెంపొందించడంలో ఆయన రచనలు కీలకపాత్ర పోషించాయన్నారు. విజయనగరం జిల్లా పేరును ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్‌ అదనపు ఎస్పీ పి.కిరణ్‌ కుమార్‌, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement