తుఫాన్‌పై అప్రమత్తతే ప్రధానం | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌పై అప్రమత్తతే ప్రధానం

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

● ప్రాణ, పశునష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

● కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ 08922–236947 ఏర్పాటు

● కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం గంటస్తంభం: భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు తుఫాన్‌ పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి, శ్రీకాకుళం, విజయనగరం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తుఫాన్‌ జాగ్రత్తలను వివరించారు. గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, గెడ్డలు, చెరువులు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ 08922–236947 కు సమాచారం అందించాలన్నారు. అవసరమైన చోట్ల జేసీబీలు, ఇతర యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశమున్నందున విద్యుత్‌ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైన పునరావాస కేంద్రాలు, తుఫాను షెల్టర్లు, పాఠశాల భవనాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement