చీపురుపల్లిరూరల్(గరివిడి):
వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే సమన్వయకర్తలని, కలిసికట్టుగా ముందుకు సాగి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలుపుదామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీ పట్ల అంకితభావంతో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో పార్టీ సంధానకర్తగా బాధ్యతలు అప్పగించిన వ్యక్తి ఆర్థిక లావాదేవీలు, భూ వ్యాపారాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. అలాంటి వారు పార్టీని వీడినా ఎలాంటి నష్టంలేదన్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల ఆదరాభిమానాలతో విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. పార్టీలో ఎవరో ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అనూష, సందీప్‌తో పాటుగా నాయకులంతా అండగా ఉంటారన్నారు. గతంలో ఒక్కరే సమన్వయకర్తగా వ్యవహరించేవారని, ఇకపై పార్టీలో ఉన్న ప్రతీ ఒక్కరూ సమన్వయకర్తలేనని స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని 11వేల మంది క్రియాశీలక కార్యకర్తలకు ఐడీ కార్డులు అందించారని, రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీరందరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమాలు, దౌర్జాన్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం అక్రమాలకు సహకరిస్తున్న కొందరు అధికారులు గుర్తించుకోవాలన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చట్టం తనపని తాను చేస్తుందన్నారు.
● మాజీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పింఛన్ కూడా మంజూరుచేయలేదని ఆరోపించారు. రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్నా కనీసం స్పందించడం లేదన్నారు.
● ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేరని, వ్యవసాయ రంగం నుంచి అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బలంగా నిలబడాలన్నారు.
● యువ నాయకురాలు బొత్స అనూష మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జాన్యాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలన్నారు. యువ నాయకుడు బొత్స సందీప్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అండగా ఉందామన్నారు. కష్టాల్లో ఎప్పుడూ మేం ఉంటాం... సమస్యలు ఏమున్నా ధైర్యంగా చెప్పొచ్చు.. అందరం కలిసి ఐక్యతగా ముందుకు సాగదామన్నారు.
● పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం అని, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో బొత్స నాయకత్వాని గెలిపించాలన్నారు.
● నియోజకవర్గ పరిశీలకురాలు శోభా స్వాతిరాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ క్యాడర్ అంతా రెట్టింపు ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ
2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం
చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా
స్థానిక ఎన్నికల్లో ఐక్యతతో పార్టీ అభ్యర్థులను గెలిపిద్దాం
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
బొత్స ఝాన్సీలక్ష్మీతో పాటు ఎంపీపీలు మీసాల విజయలక్ష్మి, ఇప్పిలి వెంకటనరసమ్మ, పొట్నూరు ప్రమీల, జెడ్పీటీసీలు వాకాడ శ్రీనివాసరావు, సీర అప్పలనాయుడు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు, మీసాల వరహాలనాయుడు, తాడ్డి వేణు, పొట్నూరు సన్యాసినాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, నాలుగు మండలాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.


