● 2029 ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యం ● స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ
జెండా ఎగురవేస్తాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ
బెల్లాన చంద్రశేఖర్
విజయనగరం:
వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యత మేరకు విజయనగరం జిల్లాలో పార్టీ పూర్వ వైభవానికి అందరి సహకారంతో కృషి చేస్తానని నూతనంగా నియామకమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్పష్టంచేశారు. 2029 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయ డమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షునిగా రెండవ సారి ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని రింగ్‌రోడ్‌లో పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బెల్లాన మాట్లాడుతూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో రెండవ సారి పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులతో కలిసి పనిచేస్తానన్నారు.
● చంద్రబాబుది వెన్నుపోటు పాలన
ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్నది వెన్నుపోటు పాలన అని బెల్లాన విమర్శించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు అధికారం కోసం ఆంఽధ్రప్రదేశ్ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు మోసపూరిత హమీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండా మాయమాటలతో మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20వేల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ ఇస్తామన్న చంద్రబాబు హమీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళలకు ముందుస్తుగా ప్రకటించిన విధంగా రుణమాపీ చేస్తే కూటమి ప్రభుత్వం మాఫీ మాట మరిచి సున్నా వడ్డీ రుణాలను నిలిపివేయడం సరికాదాన్నరు. 18 సంవత్సరాల నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.1500 ఇస్తామని నమ్మబలికి మోసగించారని, ఉచిత గ్యాస్ ఉత్తుత్తి గ్యాస్‌గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.
● దగా డీఎస్సీలో చంద్రబాబు, లోకేశ్‌లే
ముద్దాయిలు
కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లే ముద్దాయిలని బెల్లాన ఆరోపించారు. యువగళంలో పాల్గొన్న యువత నుంచి రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసి స్పోర్‌ట్స్కోటా పేరిట ప్రత్యేక జీఓలు తెచ్చి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. నిత్యావసరాలు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
● నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు వెల్లువ
బెల్లానకు ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, జిల్లా మహిళా నాయకురాలు బొత్స అనూష, రాష్ట్ర మహిళా విభాగం ప్రదాన కార్యదర్శిఽ కోలగట్ల శ్రావణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇప్పిలి అనంత్, గొర్లె రవికుమార్, ఎస్.బంగారునాయుడు, ఎస్.వేణుగోపాలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంజీవరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా పింఛనర్లు విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, ఎస్.వి.రమణరాజు, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకటరాజేష్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.


