ఆక్రమణలు తొలగిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలు తొలగిస్తాం

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

వేణుగోపాలస్వామి దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు

కొత్తవలస: తుమ్మికాపల్లి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం భూముల పరిరక్షణలో భాగంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, కొద్దిరోజుల్లో ఆక్రమణలను తొలగిస్తామని ఈఓ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సంబంధిత భూములను తమ సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. తుమ్మికాపల్లి గ్రామ సర్వే నంబర్‌ 6–2లో 14 ఎకరాల96 సెంట్లు, 6–1లో 0.21సెంట్లు, 6–4లో 0.15 సెంట్లు భూమికి సంబంధించి 80వ దశకం నుంచి ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ కోర్టు, హైకోర్టు, నేడు సుప్రీంకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయన్నారు. ఆలయ భూముల్లో రెండు సామిల్లులతో పాటు పలు శాశ్వత కట్టడాలు ఉన్నాయని, వీరందరికీ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామన్నారు. దేవస్థానానికి చెందిన సుమారు 3 ఎకరాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిర్మించారని, ఈ విషయాన్ని దేవదాయకశాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్‌ సిబ్బంది అచ్చిబాబు ఉన్నారు.

గురజాడ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం

డీఆర్వో సత్తిబాబు

విజయనగరం క్రైమ్‌: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతిని ఈ నెల 21న ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్‌ సత్తిబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు ఉదయం 8:45 గంటలకు గురజాడ స్వగృహం వద్ద మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. అనంతరం స్వగృహం నుంచి సత్య లాడ్జి సమీపంలోని కాంస్య విగ్రహం వరకు శోభాయాత్రగా ఊరేగింపు సాగుతుందని, విగ్రహానికి పూలమాలలు వేసి ‘దేశమంటే మట్టి కాదోయ్‌’ను సామూహికంగా ఆలపిస్తామన్నారు. జయంతి వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్‌ ఏఓ ప్రసాదరావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, తహసీల్దార్‌ ఎస్‌.శ్రీనివాసరావు, మున్సిపల్‌ ఇంజినీర్‌ ప్రసాద్‌, విద్యాశాఖ ఏడీ జ్యోతి, డీపీఆర్వో గోవిందరాజులు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ రాజ్యలక్ష్మి, సెట్విజ్‌ సీఈఓ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement