ఇండెంట్ పెట్టాం..
జిల్లాలో 19,690 హెక్టార్లలో వరి పంట సాగుకాలేదు. ఈ భూముల్లో పెసర, మినుము వంటి పంటలు ప్రత్యామ్నాయంగా సాగు చేసేందుకు 4,426 క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. జిల్లాలోని నాలుగు మండలాలకు సంబంధించి ప్రస్తుతం 11 క్వింటాళ్లు పెసర, మినుము విత్తనాలు మాత్రమే వచ్చాయి. మిగిలిన మండలాలకు త్వరలో వస్తాయి.
– ఎం.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
విజయనగరం ఫోర్ట్:
ఖరీఫ్ వరి సాగు కాలం గడిచిపోయింది. పుబ్బ కార్తె పోయి ఉత్తర కార్తె వచ్చింది. ఖరీఫ్ సాగుకాలం సగం గడిచిపోయింది. వాతావరణం అనుకూలించక వేలాది రూపాయల పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. రైతులకు గడ్డుపరిస్థితి. జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. ఓ వైపు పంటలు సాగుకాక, ప్రత్యామ్నాయ పంటల సాగుకు చేతిలో డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. విపత్తుల సమయంలో ఆపన్నహస్తం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం అసలత్వం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. వేలాది ఎకరాల్లో భూములు సాగుకు నోచుకోక బీడుభూములుగా దర్శినమిస్తున్నా... పంటలు సాగైన ప్రాంతాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకునేవారు లేకపోవడం కన్నీరుపెట్టిస్తోంది. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో పంటల బీమా ప్రీమియం చెల్లించనివారికి బీమా అందే పరిస్థితి లేదు. కరువు పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రైతులను పట్టించుకోనివారిని అందలం ఎక్కించి తప్పుచేశామని మదనపడుతున్నారు.
రైతులకు విత్తనాలు అందిస్తామని చంద్రబాబు సర్కార్ గత నెలరోజులుగా చెప్పుకొస్తుంది. ఖరీఫ్ సీజన్ మరో 10 రోజుల్లో పూర్తి కావస్తోంది. కాని ఇంతవరకు ప్రత్యామ్నాయ విత్తనాలకు రైతులకు అందించిన దాఖలాలు లేవు. ఖరీఫ్ సీజన్‌లో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251హెక్టార్లుకాగా, ఇప్పటివరకు 80,561హెక్టార్లలో సాగైంది. 19,690 హెక్టార్లలో వరి పంట సాగుకు నోచుకోలేదు. సాగుచేసిన చోట కూడా ఎండిపోతోంది. మొక్కజొన్న పంట సాధారణ విస్తీర్ణం 11,318 హెక్టార్లకు 8,799 హెక్టార్లు. చోడి పంట 43కు 28, వేరుశనగ 284కు 89, నువ్వులు 5,252కు 2,557, పత్తి 2,204కు 2,295, గోగు 254కు 121, చెరకు 3,813 హెక్టార్లకు 1721హెక్టార్లలో సాగైంది. వరి పంట సాగుకాని భూముల్లో సాగుచేసేందుకు ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుము, శనగ, నువ్వులు విత్తనాలు 4,426 క్వింటాళ్లు కావాలని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి పంపిస్తే వచ్చింది కేవలం 11 క్వింటాళ్లే. అదికూడ నాలుగు మండలాలకే పంపించారు. జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. విజయనగరం, డెంకాడ, రామభద్రపురం, బొబ్బిలి మండలాలకు పెసర, మినుము విత్తనాలు 11 క్వింటాళ్లు సరఫరా అయ్యాయి. విత్తనాలు కూడా ఉచితంగా కాకుండా 80 శాతం రాయితీపై ఇస్తామని ప్రకటించడంపై రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పంటలు పోయి ఏడుస్తుంటే... విత్తనాలు కూడా కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
‘ప్రత్యామ్నాయ’ సాయం ఏదీ?
రైతులపై చంద్రబాబు సర్కారు
చిన్నచూపు
ఇప్పటికే జిల్లాలో కరువుఛాయలు
విత్తనాలు కూడా పూర్తిస్థాయిలో సరఫరా చేయని వైనం
అవి కూడా ఉచితం కాదు.. రాయితీపై కొనుగోలు చేయాలి
ఆవేదనలో జిల్లా రైతాంగం


