విజయనగరం ఫోర్ట్: చేసినది తక్కువైనా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబుకు మించిన రాజకీయ నాయకుడు మరొకరు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేశారు. అమరావతి పనుల పేరుతో కమీషన్ల రూపంలో ప్రజాధనం లూటీ చేస్తూ... ఇప్పుడు 104 సాక్షిగా ప్రచార యావకు తెరతీశారు. రంగులు బాగున్న వాహనాలకు పసుపురంగు పులుముతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మకనిపిస్తేనే శివాలెత్తిపోయే చంద్రబాబునాయుడు... ఇప్పుడు ఆరోగ్యసేవలను పక్కనపెట్టి ప్రచారానికి తెరతీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవల ను నిర్లక్ష్యం చేస్తూ... ప్రజల కళ్లుగప్పేందుకు రంగు లు పులుముతున్నారంటూ పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేందుకు, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున భృతి చెల్లించేందుకు లేని డబ్బులు రంగులతో రాజకీయం చేసుందుకు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. రీఫ్యాబ్రికేషన్ పేరుతో 104 వాహనాలకు రంగులు పులిమేబదులు రోగులకు పూర్తిస్థాయిలో మందులు సమకూర్చితే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. వీటిలో మొదటి విడతగా 6 వాహనాలను రీఫాబ్రికేషన్ (రంగులు వేయించడం) కోసం విజయవాడకు వెళ్లాయి. వాటికి పూర్తయిన తర్వాత విడతలు వారీగా అన్ని వాహనాలకు పసుపురంగు వేయనున్నారు. ఇప్పటికే 108 అంబులెన్సులకు పూర్తి స్థాయిలో చంద్రబాబు సర్కారు రంగులను మార్చేసింది. ఇప్పుడు 104 వాహనాలకు మార్చుతోంది.
రోగుల ఇబ్బందులు పట్టించుకోకుండా...
104 వాహనాలకు రంగులు మార్చడంపై చంద్రబాబు సర్కారు చూపుతున్న శ్రద్ధ రోగుల ఇబ్బందులను పరిష్కరించడంలో చూపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా 104 వాహనాల్లో మందులు పూర్తి స్థాయిలో లేక రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
రంగులు వేస్తున్నారు...
రీఫ్యాబ్రికేషన్‌లో భాగంగా జిల్లాలోని ఆరు 104 వాహనాలకు విజయవాడలో రంగులు వేస్తున్నారు. వాటికి పూర్తయిన తర్వాత మిగతా వాటికి వేస్తారు. మందులు కొరత ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. – కె.శ్రీకాంత్, 104 జిల్లా మేనేజర్
వాహనాల రంగులు బాగున్నా పసుపు రంగు పులుముతున్న చంద్రబాబు సర్కారు
ప్రచార యావకు ప్రజాధనం
దుర్వినియోగం
మరోవైపు మందులు లేక అల్లాడుతున్న రోగులు


