విజయనగరం అర్బన్: ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాల్సిన అభివృద్ధి నిధులు అసలు ఎక్కడ ఖర్చవుతున్నాయి..? పట్టణంలో అత్యవసర మౌలిక వసతుల కంటే, రియల్ ఎస్టేట్ అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం పట్టణంలో వీఎంఆర్‌డీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 98 అభివృద్ధి పనులకు రూ.9.99 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా అందుబాటులో ఉన్న అధికారిక నివేదికల ప్రకారం వీటిలో 97 పనులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.9.59 కోట్లు. మరో పని రూ.39.80 లక్షలతో రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ ప్రొగ్రెస్‌లో గానీ, గ్రౌండింగ్ కోసం ఎదురుచూస్తున్న పనులేవీ లేవని లెక్కలు చెబుతున్నాయి.
లెక్కల్లో ఫుల్..
పనుల సంఖ్యను చూస్తే దాదాపు 99 శాతం పూర్తయినట్లుగా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఖర్చు పరంగా కూడా దాదాపు 96 శాతం విలువైన పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే నగరంలోని శివారు కాలనీల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కామాక్షినగర్, ధర్మపురి, వైఎస్సార్‌నగర్, గాజులరేగ, మజ్జిపేట, బీసీ కాలనీ, దుప్పాడ, తదితర శివారు ప్రాంతాల్లో నేటీకి గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోడ్ల మీదనే వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవసరం ఉన్నచోట కాకుండా అవసరం లేని చోట్ల రోడ్లు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.
లే అవుట్లకు ఎందుకంత ప్రాధాన్యం..
ప్రత్యేక పాలనలో ఉన్న సమయంలో అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష జోక్యం లేకపోవడంతో అధికార యంత్రాంగం మాటే చెల్లుబాటు అవుతుంది. ఈ పరిస్థితిని అధికార పా ర్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జనావాసాలు లేని ప్రాంతాల్లో వెడల్పాటి రహదారులు, లే అవుట్లు, రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లే అవుట్లలో సంబంధిత యజమానులు రోడ్లు వేయాలి. కాని ఇక్కడ ప్రభుత్వ ధనంతో రోడ్లు వేయించి, లేఅవుట్ యజమానులకు మేలు చేస్తున్నారు. ఇప్పటికే జనాభా అధికంగా ఉన్న.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏయే పనులు ఏ ప్రాంతాల్లో చేపట్టారు..? వాటి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి..? ఆయా రహదారుల వల్ల ప్రస్తుతం ఎంతమంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది..? రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు ప్రయోజనం కలిగే ప్రాంతాల్లో చేపట్టిన పనుల సంఖ్య ఎంత..? వంటి వివరాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
లే అవుట్లలో రహదారుల జోరు
శివారు కాలనీల్లో అధ్వానపు తీరు
రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేస్తున్న అధికారులు
కాలనీ వాసులకు తప్పని ఇక్కట్లు
సామాజిక ప్రయోజనం ఎంత..?
98 పనులకు దాదాపు రూ.10 కోట్ల నిధులు వెచ్చించిన నేపథ్యంలో.. ప్రతి పనికి సంబంధించిన వార్డు, ప్రాంతం, పనితీరు, వ్యయం, రహదారి పొడువు, లబ్ధిదారుల సంఖ్య, తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు. అధికారిక లెక్కల్లో పనులు దాదాపు పూర్తయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆ పనుల్లో ఎన్ని ప్రజల అత్యవసర అవసరాలను తీర్చాయి? ఎన్ని భవిష్యత్ వాణిజ్య, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతాల్లో ఉన్నాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిధులు ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యమా.. లేక ప్రజలకు అత్యవసరమైన చోటే ఖర్చు చేయడమే అసలు లక్ష్యమా? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


