డీఎస్సీ నిరుద్యోగుల ప్రశ్నలు ఇవే....
● డీఎస్సీ–2025 నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్వతంత్ర విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదు?
● తప్పు జరగలేదని ప్రభుత్వం నమ్మితే.. సీబీఐ విచారణకు అభ్యంతరం ఎందుకు?
● సాధారణ ఆత్మీయ సమావేశానికి డీఎస్సీ టీచర్ల హాజరు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఏమిటి?
● ప్రతిభతో ఉద్యోగం వచ్చిన అభ్యర్థులతో అక్రమాలు జరగలేదని చెప్పించే ప్రయత్నాలు ఎవరికోసం? అక్రమాలు రుజువైతే పదవులు పోతాయని భయమా?
● మూడు లక్షల మంది నిరుద్యోగుల సందేహాలకు సమాధానం చెప్పకుండా.. ఉద్యోగాలు పొందిన వారితో మాత్రమే ‘ఆత్మీయత’ ఎందుకు?
విజయనగరం అర్బన్:
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, సీబీఐతో విచారణ జరపాలంటూ వైఎస్సార్‌సీపీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని పట్టుపడుతున్నారు. కొన్ని కోటాల్లోనే అక్రమాలు జరిగాయని, వాటిపై నిగ్గుతేల్చాలని కోరుతున్నారే తప్ప మొత్తం ఉద్యోగాలు పొందిన వారంతా తప్పులు చేసి పోస్టులు పొందినట్లు ఎక్కడా చెప్పడంలేదు. ఎవరి ప్రతిభనూ తక్కువ చేయలేదు.. కించపరచనూ లేదు. అయితే, వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు సర్కారు ‘ఆత్మీయ సమావేశాల’ పేరుతో కొత్తనాటకానికి తెరతీసింది. విచారణకు వెనకాడుతూ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగులను రెచ్చగొడుతోంది. అక్రమాలు జరగలేదని వారితో చెప్పించే ప్రయత్నం చేస్తోంది.
దీనికోసం ఉత్తరాంధ్ర జిల్లాల స్థాయిలో ఆదివారం విశాఖలో ‘ఆత్మీయ సమావేశం’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో పాల్గొనాలని గత డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారి ఇళ్లకు స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులే వెళ్తున్నారు. రెచ్చగొట్టే మాటలతో ఉపాధ్యాయుల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్సార్ సీపీ దుష్ప్రచారం చేస్తోందని వారిలో ఆందోళన కలిగిస్తున్నారు. ఎవరి ఉద్యోగాలు కూడా పోవని ‘రాజకీయం’ చేస్తున్నారు. తాము చేసిన తప్పిదాలను అంగీకరించకుండా.. ప్రతిపక్ష పార్టీ పట్ల విషం నింపుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని ఈ వింత నాటకాన్ని చూసి ఉపాధ్యాయ వర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయి.
సమావేశానికి డీఎస్సీ ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు ఆదేశిస్తున్నారని ఆరోపణలు మరింత వివాదానికి కారణమవుతున్నాయి. హాజరు తప్పనిసరి అయితే.. ఆ సమావేశం ప్రభుత్వ అధికారిక కార్యక్రమమా? అధికారిక కార్యక్రమమే అయితే.. దాని ఉద్దేశం, ఎజెండా ఏమిటి? సాధారణ ఆత్మీయ సమావేశమే అయితే... హాజరును తప్పనిసరి చేయాల్సిన అవసరం ఏమిటి? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
డీఎస్సీ కోసం సిద్ధమై, పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూసి, నియామక ప్రక్రియపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యా యులు ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని కోటాల్లో జరిగిన తప్పిదాలపై సమాధానం ఇవ్వకుండా.. ఉద్యోగాలు వచ్చిన కొద్ది మందితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం వల్ల నిరుద్యోగుల్లో మరింత అనుమానం పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం చేయాల్సింది సమావేశాలు నిర్వహించడం కాదని.. ముందుగా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల డీఎస్సీ ఉపాధ్యాయులతో నిర్వహించనున్న సమావేశం... ఆత్మీయ సమావేశమా... తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న రాజకీయ సమీకరణమా అన్న చర్చ జోరందుకుంది. సాధారణంగా ఉపాధ్యాయుల సమావేశాల్లో విద్యాప్రమాణాలు, బోధన పద్ధతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలల నిర్వణ వంటి అంశాలపై చర్చ జరగాలి. డీఎస్సీ నియామకాలపై వివాదం కొనసాగుతున్న సమయంలోనే కొత్తగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో భారీ స్థాయిలో ‘ఆత్మీయ సమావేశం’ నిర్వహించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.
అధికార యంత్రాంగం మొత్తం ‘ఆత్మీయ’ పనిలోనే?
సమావేశానికి ఉపాధ్యాయులను సమీకరించే బాధ్యతలను విద్యాశాఖకు చెందిన అధికారులు తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా జిల్లా, డివిజన్ స్థాయి విద్యాశాఖ అధికారులు ఎంఈఓలకు వెబ్‌ఎక్స్ వంటి ఆన్‌లైన్ మాద్యమాల్లో ఆదేశాలిస్తూ ఇదే పనిలో నిమగ్నమయ్యారని.. ఆ ఆదేశాలు, సూచనలు అందుతున్నాయని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెటర్నటీ లీవులు వంటి లాంగ్ లీవుల్లో ఉన్న టీచర్లు కూడా విధిగా హాజరుకావాలని మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఇది అధికారిక విద్యా కార్యక్రమమా? లేక ప్రభుత్వానికి అనుకూలంగా డీఎస్సీ ఉద్యోగుల సమీకరణ కార్యక్రమమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఉపాధ్యాయులతో ఇదో కొత్తరాజకీయం అంటూ విద్యావేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. అక్రమాలు జరగబట్టే ఆత్మీయ సమావేశాల పేరుతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘తప్పనిసరి’ అంటే ఎందుకు?
మూడు లక్షల మంది గొంతు వినపించదా?
డీఎస్సీ–2025 టీచర్లతో నేడు విశాఖలో ‘ఆత్మీయ సమావేశాలు’
డీఎస్సీ ఉద్యోగుల ఇళ్లకు స్వయంగా ఎమ్మెల్యేలే వెళ్లి సానుభూతి నాటకం
ఆత్మీయ సమావేశానికి బస్సుల్లో
తరలింపు.. ఎంఈవోలకు బాధ్యతలు
సర్కారు తీరుపై నిరుద్యోగ అభ్యర్థుల ఆగ్రహం
అక్రమాలు జరగకుంటే విచారణకు భయమెందుకు?
మూడు లక్షల మంది నిరుద్యోగుల
గొంతు వినపించదా?
డీఎస్సీ నియామక ప్రక్రియపై అభ్యంతరాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిరుద్యోగులు అంటున్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే... స్వతంత్ర దర్యాప్తుకు సిద్ధపడడంలో ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. విచారణకు ఆదేశించడం, అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం, పారదర్శకతపై నమ్మకం కల్పించడం కంటే... ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిని సమీకరించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్య పరిష్కారం కాదని నిరుద్యోగ సంఘాలు అంటున్నాయి.


