విద్యార్థులను ఖైదీలుగా చూడడం సరికాదు
గిరిజన సంక్షేమశాఖ మంత్రి
ఏం చేస్తున్నారు?
గిరిజన విద్యార్థులంటే అంత చులకనా?
చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
సాలూరు రూరల్: విశాఖపంట్నం జిల్లా మారికవలసలోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చదువుతున్న గిరిజన విద్యార్థులను రాత్రికిరాత్రే పోలీసుల సహకారంతో బస్సుల్లో బలవంతంగా ఎక్కించి ఖైదీలను తరలించినట్లు ఇతర ప్రాంతాలకు తరలించడంపై వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మండిపడ్డారు. తన నివాసంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గిరిజన విద్యార్థులపై చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. గిరిజన విద్యార్థులకు సబ్‌ప్లాన్ నిధులతో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు 2004లో మారికవలసలో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ అకడమిక్‌తో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. గిరిజనుల డబ్బు లతో నడుస్తున్న పాఠశాలను ప్రైవేటు వ్యవస్థకు అప్పగించేందుకు ప్రయత్నించడం దారుణమన్నా రు. విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీస సమాచారం లేకుండా పాఠశాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో సీటు సాధిస్తే గిరిజన విద్యార్థులు అదృష్టంగా భావిస్తారని, అన్నిరకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న పాఠశాలను మూసేసి, విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడంలో ఉద్దేశమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖామంత్రి సంధ్యారాణి సబ్ ప్లాన్ నిధులతో వ్యాపారాం చేయాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలను వేరే చోటుకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా గిరిజన విద్యార్థులకు మేలుచేసే ఉద్దేశం ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేయాలే తప్ప ప్రైవేటు ఉపాధ్యాయులకు లక్షల్లో జీతాలు ఇచ్చినట్లు చూపించి గిరిజన విద్యార్థుల సొమ్మును కాజేసే ప్రయత్నం చేయకూడదన్నారు. సాలూరులో కూడా బీసీ హాస్టల్‌లో చదువుకుంటున్న విద్యార్థులను బంగారమ్మ పేటలో ఉన్న వసతిగృహానికి బలవంతంగా తరలించారని గుర్తుచేశారు. మానవత్వం లేకుండా పాఠశాల నుంచి సామాన్లుతో సహా విద్యార్థులను గెంటేయడంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు అందడం ఖాయమన్నారు.


