● రోడ్డు ప్రమాదంలో యువకుడి
దుర్మరణం
● ఎయిర్‌పోర్టులో ఉద్యోగంలో
చేరకముందే విషాదం
పార్వతీపురం రూరల్: ఎదురుచూసిన ఉద్యోగం తలుపుతట్టిందన్న సంతోషం ఆ కుటుంబంలో మూణ్నాళ్ల ముచ్చటే అయింది. చేతికందొచ్చిన కొడుకు గూటికి ఆసరా అవుతాడనుకునేలోపే.. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. పార్వతీపురం పట్టణంలో శనివారం జరిగిన ఈ ఘోర దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం పట్టణంలోని నవిరి కాలనీకి చెందిన రౌతు సాగర్ (30) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎస్‌వీడీ డిగ్రీ కళాశాల సమీపంలో ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ హఠాత్పరిణామంతో నియంత్రణ కోల్పోయిన యువకుడు రోడ్డుపై పడిపోయాడు. సరిగ్గా అదే సమయానికి పార్వతీపురం వైపు వస్తున్న ‘వనజ’ ఆర్టీసీ బస్సు సాగర్‌పై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి ఇటీవలే భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉద్యోగం వచ్చింది. ఇంకొన్ని రోజుల్లోనే విధుల్లో చేరాల్సి ఉంది. జీవితంలో స్థిరపడుతున్నాడన్న తరుణంలో జరిగిన ఈ ఘోరకలితో తల్లిదండ్రులు గోపాలనాయుడు, ఇందిరమ్మ విషాదంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకుని కొడుకు మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించారు. చేతికందిన యువకుడిని మృత్యువు కాటేసిందంటూ కన్నీరుపెట్టారు.


