● ఏపీ చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు
● ఫ్యాక్టరీ వద్ద రైతులతో కార్యాచరణ సమావేశం
రేగిడి: ఎల్‌నినో పేరుతో సంకిలి ఈఐడీ సుగర్ ఫ్యాక్టరీ మూసివేస్తామంటే అంగీకరించే ప్రసక్తేలేదని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు హెచ్చరించారు. సుగర్‌ఫ్యాక్టరీ గేటు వద్ద ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగుచేస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులతో కలిసి శనివారం నిర్వహించిన భవిష్యత్తు కార్యాచరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2027–28 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌నినో పేరుతో సుగర్ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్‌ను నిలుపుదలచేస్తున్నామని ఫ్యాక్టరీ ప్రకటించడం సమంజసం కాదన్నారు. వెంటనే ఈ ప్రకటనను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మొక్కపంటను వేసిన రైతులు ఏం కావాలని ఆందోళన వ్యక్తంచేశారు. అటు ప్రభుత్వం, ఇటు చక్కెర పరిశ్రమ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు చెరకు రైతు భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చాయని ఆరోపించారు. చెరకు ఫ్యాక్టరీతో ఆర్జించిన లాభాలతో ఇథనాల్, ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడే వాతావరణ కాలుష్య పరిశ్రమలు నెలకొల్పిందని, ఆ వ్యర్థాలు విషతుల్యంగామారి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో పంటలకు నష్టం కలిగిస్తున్నాయన్నారు. చక్కెర పరిశ్రమ మూసివేసే పరిస్థితి వస్తే పక్కనే ఉన్న ఇథనల్ ఫ్యాక్టరీ కూడా మూసివేయాలని పట్టుబట్టారు. క్రషింగ్‌కు సరిపడే చెరకు లేదని యాజమాన్యం కుంటిషాకులు చెబుతోందని, గతంలో మాదిరిగా రైతులకు ప్రోత్సాహకాలు, విత్తనాలు, ఎరువులు ఇవ్వడంతో పాటు సకాలంలో నగదు చెల్లింపులు ఉంటే చెరకు సాగు ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు. తగినంత ఫీల్డ్ సిబ్బంది లేకపోవడం, కార్మికులను తగ్గించడం ఫ్యాక్టరీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. చెరకు మద్దతుధర టన్నుకు రూ.5 వేలు ఇవ్వాలని, కర్ణాటక, తమిళళనాడు రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు చెరకు సాగుచేస్తున్న రైతుకు టన్నుకు రూ.500లు ప్రోత్సాహక నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణిను కలిసి చెరకు ఫ్యాక్టరీ మూతపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించామని, రైతులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. యాజమాన్యం, ప్రభుత్వం వినకుంటే ఫ్యాక్టరీ గేటు ముందు నిరవధిక నిరాహార దీక్షలు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ నెల 30 నుంచి కార్యక్రమాల నిర్వహణకు కమిటీని ఎంపిక చేశారు. కార్యక్రమంలో రైతులు కింజరాపు సురేష్, సూర్యప్రకాష్‌భుక్త, పాలకొండ ఏఎంసీ మాజీ చైర్మన్ చింత సంగంనాయుడు, కరణం శ్రీనివాసరావు, కర్రి రమణ, కెంబూరి కోటేశ్వరరావు, నారు అప్పలనాయుడు, కొమరాపు బలరాం, కర్రి పోలినాయుడు, ఎన్ని గోవిందరావు, సౌరోతు వెంకటరమణ, కిమిడి సోంబాబు, గేదెల సత్యం, తాడేల తవిటినాయుడు, నారాయణరావు, వారా డ వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.


