● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: ఎల్‌నినో ప్రభావం, వర్షా భావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్–2026లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటల సాగుపై సబంధిత అధికారులతో వెబెక్స్‌లో శనివారం సమీక్షించారు. సెప్టెంబర్ మొదటి వారంలో విత్తన కాలం ముగిసే అవకాశం ఉన్నందున రైతుల అవసరాలకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటి అవసరమయ్యే రాగి, జనుము, ఉలవలు, మినుములు, పెసలు వంటి ప్రత్యా మ్నాయ పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పశుగ్రాసం, కూరగాయల పంటల సాగును ప్రోత్సహించాలన్నారు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖలవారీగా కాకుండా సమన్వయంతో, ప్రాధాన్యతా క్రమంలో స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌ను రుపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. గత ఏడాది కంటే ఒక్క ఎకరా పంట విస్తీర్ణం తగ్గకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఆరికతోట జెడ్పీ హైస్కూల్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు
రామభద్రపురం: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఏటా క్రీడల్లో ప్రతిభ ప్రదర్శించే పాఠశాలలకు ఇచ్చే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఈ ఏడాది మండలంలోని ఆరికతోట జెడ్పీ ఉన్నత పాఠశాలను వరించింది. పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడాపోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించినందుకు అవార్డును ప్రకటించారు. జిల్లా కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయుడు బొత్స రత్నకిశోర్‌కు డీఈఓ యు.మాణిక్యంనాయుడు శనివారం అవార్డును అందజేశారు. కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ నల్ల వెంకట్నాయుడు, గౌరవాధ్యక్షుడు ఎల్.వి.రమణ, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు గోపాల్, విజయలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అవార్డు రావడం పట్ల స్థానిక మండల విద్యాశాఖాధికారి, పాఠశాల హెచ్‌ఎం హర్షం వ్యక్తంచేశారు.
విచారణ లేకుండా ఓట్లు తొలగించొద్దు
పూసపాటిరేగ: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓట్లు తొలిగింపుపై అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి విచారణ లేకుండా ఓట్లు తొలగింపులు చేపడితే సంబంధిత అధికారులు బాధ్యులవుతారని రాష్ట్ర ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ హెచ్చరించారు. భోగాపురం మండలకేంద్రంలోని 231, 228, 227 పోలింగ్ స్టేషన్‌లలో ఓటరు జాబితాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓట్లు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు. ఫారం–6 ద్వారా కొత్తగా ఓట్లు చేర్పించాలన్నారు. ఆయన వెంట నెల్లిమర్ల నియోజకవర్గం ఎన్నికల అధికారి డి.ఆశయ్య, భోగాపురం తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్, ఎంపీడీఓ డి.స్వరూపారాణి, నెల్లిమర్ల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ యు.కల్యాణి, తదితరులు ఉన్నారు.
డ్రాపౌట్స్ లేకుండా చూసుకోండి
గజపతినగరం: గజపతినగరం మండలంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. గజపతినగరం ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో జరిగిన స్కూల్ కాంప్లెక్స్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించి డ్రాపౌట్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా సులభతరంగా, నైతిక విలువలతో కూడిన విద్యను బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ విమలమ్మతో పాటు బాలుర హైస్కూల్ హెచ్‌ఎం ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


