తెర్లాం: అనుమానాస్పద స్థితిలో ఓ అవివాహిత మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం పెరుమాళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై బి.సాగర్‌బాబు బుధవారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పెరుమాళి గ్రామానికి చెందిన బాణాల హేమలత (52) అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే మంచంపై మృతి చెందింది. మృతురాలు హేమలత తన అక్క ఝాన్సీతో కలిసి ఒకే ఇంట్లో నివాసముంటోంది. అక్క ఝాన్సీ మూగ, చెవిటి, మతిస్థిమితం లేని మహిళ. హేమలత ఇంట్లో నుంచి బుధవారం ఉదయం దుర్వాసన రావడంతో ఆమె వదిన ప్రభావతి స్థానికులకు, పోలీసులకు విషయం తెలియజేసింది. దీంతో ఎస్సై సాగర్‌బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హేమలత రెండు, మూడు రోజుల కిందటే మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతి చెందిందా..? ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హేమలత, ఝాన్సీలిద్దరూ అవివాహితులే. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆమె ఏవిధంగా మృతి చెందిందో తెలుస్తుందని పో లీసులు చెబుతున్నారు. శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి వదిన ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు, మూడు రోజుల కిందటే మృతి చెందినట్లు అనుమానం
మతిస్థిమితం లేని అక్కతో కలిసి
ఉంటున్న మృతురాలు
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు


