● గ్రామంలో పర్యటించి పరిస్థితిని
సమీక్షించిన డీఎంహెచ్‌ఓ
శృంగవరపుకోట: గిరిసీమల్లో మరో చిన్నారి ప్రాణం బలైపోయింది. బొడ్డవర పంచాయతీ బొడ్డపాడు గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి దుంబర అనితారాణి జ్వరంతో బుధవారం కన్నుమూసింది. బాలిక తల్లిదండ్రులు శ్రీను, సన్యాసమ్మలు మాట్లాడుతూ.. నాలుగు రోజుల కిందట జ్వరం వస్తే బొడ్డవరకు చెందిన ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లామన్నారు. ఆయన రక్తపరీక్షలు చేయించమని చెప్పి, కొన్ని మందులు ఇచ్చారని, ఆ మందులు వాడినా ఫలితం లేకపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. గ్రామానికి చెందిన గిరిజన యువత, గిరిజన సంఘ ప్రతినిధులు మాత్రం వైద్యారోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో గిరిజన చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యారోగ్యశాఖ నియంత్రణ లేకపోవడం వల్ల సంచి వైద్యులు వచ్చీరాని వైద్యంతో ప్రాణాలు తీస్తున్నారని వాపోయారు. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ జీవనరాణి బొడ్డవర చేరుకుని పీహెచ్‌సీ వైద్యులు హారిక, సోహైల్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్రామాల్లో అనుమతుల్లేని రక్తపరీక్ష కేంద్రాలు, అర్హత లేని ఆర్‌ఎంపీలు పుట్టుకొస్తున్నారని, గిరిజనం వారినే నమ్ముతున్నారని వైద్యులు తెలిపారు. దీంతో డీఎంహెచ్‌ఓ స్పందిస్తూ అటువంటి కేంద్రాలు, వైద్యుల వివరాలు సేకరించి పంపించాలని ఆదేశించారు. చిన్నారి మృతిపై ఎమ్మెల్సీ రఘురాజు సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీపీ సోమేశ్వరరావు, తదితరులు గ్రామానికి చేరుకుని బాధత కుటుంబ సభ్యులను పరామర్శించారు.


