తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి..! | - | Sakshi
Sakshi News home page

తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి..!

Aug 23 2026 12:28 AM | Updated on Aug 23 2026 12:28 AM

తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి..!

తిరుపతిలో జరగనున్న అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలకు

బయలుదేరిన విజయనగరం క్రీడాకారులు

ప్రయత్నం చేశాం బడ్జెట్‌ సరిపోలేదు..

రాష్ట్ర స్థాయిలో జరగనున్న అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రయత్నించినా బడ్జెట్‌ సరిపోలేదు. ఆర్టీసీ అధికారులు ఓ వైపు ప్రయాణానికి ఒక్కో బస్సుకు రూ.85వేలు అడిగారు. ప్రైవేటు ట్రావెల్స్‌ వారు రూ.1.05లక్షలు డిమాండ్‌ చేశారు. జిల్లాలోని క్రీడాకారులకు బస్సులు ఏర్పాటు చేయాలంటే సుమారు 12 బస్సులు అవసరం ఉంటుంది. దీంతో క్రీడాకారులకు మంజూరైన నిధులను టీఏ, డీఏల రూపంలో అందజేసి పోటీలకు హాజరుకావాలని కోరాం.

– ఎస్‌.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం

విజయనగరం: తాంబూలం ఇచ్చాం.. తన్నకు చావండి.. అన్న చందంగా మారింది రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలకు వెళ్తున్న విజయనగరం జిల్లా క్రీడాకారులు పరిస్థితి. హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29వ తేదీన నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనాల్సిన క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పిస్తామని ప్రకటించగా... తాజాగా సరిపడా బస్సులు లేవంటూ చేతులెత్తేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీలకు హజరయ్యే క్రీడాకారులు టీఏ, డీఏల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 800 మాత్రమే చేతుల్లో పెట్టి పోటీలు జరిగే తిరుపతి వద్దకు హాజరు కావాలని సూచించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

క్రీడాకారులతోనే ఆటలా...?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రీడాకారుల జీవితాలతో ఆటాలడుకుంటుందోన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలు అమలు మాదిరి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న క్రీడా పోటీల విషయంలో మాటలు మార్చి ఇబ్బందులకు గురి చేస్తోంది. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నిర్వహించిన అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 450 మంది క్రీడాకారులతో పాటు 50 మంది కోచ్‌ అండ్‌ మేనేజర్‌లు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 23 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు హాజరు కావాల్సిన క్రీడాకారులు అవసరైన రవాణా సదుపాయాలు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారుల ద్వారా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తాజాగా ఒక్కో క్రీడాకారుడు, కోచ్‌ అండ్‌ మేనేజర్‌లకు రూ.800 చొప్పున అందజేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఇందులో విజయనగరం నుంచి తిరుపతికి రెండు వైపులా జనరల్‌ రైలు బోగిలో ప్రయాణించేందుకు రూ.600 ఇవ్వగా... ఓ వైపు డీఏ కింద రూ.200 ఇచ్చారు. తిరుగు ప్రయాణపు డీఏ తిరుపతిలో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. సుమారు 900 కిలోమీటర్ల దూరంలో గల తిరుపతికి వెళ్లి వచ్చేందుకు ఒక్కో క్రీడాకారుకుడికి రూ.800 ఇస్తే ఎలా సరిపోతుందన్న వాదన వ్యక్తమవుతోంది. తిరుపతికి వెళ్లి వచ్చేందుకు ఆ మొత్తం ఎలా సరిపోతుందన్నది క్రీడాకారుల ప్రశ్న.

క్రీడాకారులకు కేటాయించలేరా...?

ప్రభుత్వ హయాంలో ఎటువంటి సభలు నిర్వహించినా సుమారు 7 నుంచి 8 జిల్లాలకు చెందిన డిపోల బస్సులను కేటాయిస్తుంటారు. అదే బావి భారత క్రీడాకారులకు బస్సులు కేటాయించేందుకు అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభించటం గమనార్హం. వాస్తవానికి శాప్‌ అధికారులే జిల్లాల వారీగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి క్రీడాకారులకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్థాయిలో అధికారులు వారి సంప్రదించే సమయంలో తగిన బస్సులు లేవంటూ సమాధానమివ్వడం విశేషం. ప్రభుత్వ అధికార బహిరంగ సభలకు వేల సంఖ్యలో బస్సులు కేటాయించే అధికారులు, ప్రతిభ క్రీడాకారుల కోసం జిల్లా నుంచి 6 బస్సులు కేటాయించటంలో నిర్లక్ష్యం నటించడం తలదించుకునే విషయం.

అధికారులు ఒత్తిడి చేస్తే విజయనగరం నుంచి తిరుపతికి వెళ్లేందుకు ఓ వైపు రూ.85వేల ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సైతం వెనక్కి తగ్గిపోయారు. దీంతో చేసేదేమి లేక ప్రైవేటు ట్రావెల్స్‌ వారిని ఆశ్రయిస్తే ఓ వైపు 40 మంది రాకపోకలు సాగించేందుకు రూ.1.05 వేలు డిమాండ్‌ చేసినట్లు చెబుతున్నారు. చివరికి చేసేదేమి లేక ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను క్రీడాకారులకు నేరుగా ఇచ్చి పోటీలకు హాజరు కావాలంటూ పంపించటం కొసమెరుపు. దీంతో ప్రభుత్వం తీరుపై క్రీడాకారులు, కోచ్‌ అండ్‌ మేనేజర్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తిరుపతికి వెళ్లేందుకు రైలు సౌకర్యం తక్కువగా ఉంటుందని, ఒక్కో జిల్లా నుంచి 500 మంది హాజరైన ఐదు జిల్లాల నుంచి 2500 మంది క్రీడాకారులకు ఎలా ప్రయాణం దొరుకుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement