విజయనగరం: విద్యార్థులు, యువతలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి 17వ తేదీ వరకు నవతరోత్సవాలు నిర్వహించనున్నట్టు క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్ వెల్లడించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే రోటరీ సెంట్రల్ క్లబ్ ఆధ్వర్యంలో నవతరోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సంగీతం, సాహిత్యం, చిత్ర లేఖనం, క్రీడలు, యోగ తదితర అన్ని రంగాల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్‌ను గుర్తించి విజేతలకు బహుమతులను అందజేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్ ఆరో తేదీన ముగింపు కార్యక్రమం నిర్వహించి అదే రోజున విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. పోటీలలో పట్టణంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కళాశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో క్లబ్ సెక్రటరీ బత్తుల చందు, ఉత్సవాల చైర్మన్‌లు ముఖేష్, మారుతి రాజ్, డైరెక్టర్ కృష్ణ తేజతో పాటు రోటరీ సెంట్రల్ క్లబ్ ప్రతినిధులు ఆర్.శంకర్ రెడ్డి, పి.జై కృష్ణ , ఉదయ్, మనోజ్, కాపుగంటి ప్రకాష్ , ఫాస్ట్ గవర్నర్ ఎం.రామారావు తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ కృష్ణపై రెండు కేసులు నమోదు
విజయనగరం టౌన్: పూసపాటిరేగ పోలీసుస్టేషన్ పరిధిలో సిహెచ్.అగ్రహారంలో చోటుచేసుకున్న భూ వ్యవహార సంఘటనపై ఓ పత్రికా రిపోర్టర్, రెవెన్యూ అధికారులపై గుడివాడ కృష్ణ దాడులకు, బెదిరింపులకు పాల్పడినట్లు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినట్లుగా ఫిర్యాదుదారులు ఇచ్చిన రిపోర్టుల మేరకు పూసపాటిరేగ పోలీసులు రెండు క్రిమినల్ కేసులను వేర్వేరుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ ఎఆర్.దామోదర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూసపాటిరేగ పోలీసుస్టేషన్ పరిధిలోని సిహెచ్.అగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడినట్లుగా వచ్చిన సమాచారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా, అదే గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణ రెవెన్యూ అధికారుల విధులకు భంగం కలిగించడంతో పాటూ, బెదిరింపులకు పాల్పడ్డారని, మండల తహశీల్దార్ పూసపాటిరేగ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనపై పత్రికలో వార్త ప్రచురించిన వ్యక్తిపైన గుడివాడ కృష్ణ భౌతిక దాడికి పాల్పడినట్లు బాధితుడు పిర్యాదుతో మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. రెండు కేసుల్లో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
సాలూరు రూరల్: ఐదేళ్ల తరువాత గంజాయి నిందితుడిని పట్టుకున్నట్టు ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. 2021లో అప్పటి ఎస్‌ఐ ఫక్రుద్దీన్ మండలంలోని జీగిరాం గ్రామం వద్ద నిలిపి ఉన్న టాటా ఇండిగో కారును గుర్తించి తనఖీ చేయగా 38 ప్యాకెట్లలో 155 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకోట పంచాయతీకి చెందిన సంజిత్‌ఖార్ అనే వ్యక్తి తన కారు మరమ్మతులకు గురవడంతో జీగిరాం గ్రామం వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కారును పరిశీలించిన పోలీసులకు అప్పట్లో గంజాయి దొరకడంతో అప్పటి నుంచి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పలుమార్లు ఒడిశాలో నిందితుడు స్వగ్రామం వెళ్లినప్పటికీ పట్టుబడలేదు. ఎట్టకేలకు రూ.21లక్షల విలువ చేసే కారు, మోటారుబైక్, గంజాయితో పాటు నిందితుడిని శనివారం జీగిరాం సమీపంలో పట్టుకున్నామని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఇతనితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నట్టు తెలిసిందని వారిని కూడా పట్టుకుంటామన్నారు. కేసు ఛేదించడంలో చొరవ చూపిన సీఐ, ఎస్‌ఐతో పాటు సిబ్బందిని ఎస్పీ మాధవరెడ్డి అభినందించారు.


