● భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ
కొనసాగించాల్సిందే...
● ప్రభుత్వం తీరుపై గళమెత్తిన నాయకులు
గజపతినగరం రూరల్ (జామి): భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని రక్షించే బాధ్యత ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమని, ఫ్యాక్టరీని విక్రయిస్తే ఊరుకునేది లేదని వివిధ పార్టీల నాయకులు, ప్రజా, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది రైతుల సహకారంతో ఏర్పడిన ఫ్యాక్టరీ అని స్పష్టంచేశారు. జామి మండలం భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం వివిధ పార్టీలు, రైతు సంఘాలతో కూడిన పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్టీ మండలాధ్యక్షుడు గొర్లె రవికుమార్ మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఫ్యాక్టరీలకు చేయూతనివ్యాల్సిన ప్రభుత్వం తప్పించుకునే ధోరణి ప్రదర్శించడం దారణమన్నారు. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరారు. 2004 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఫ్యాక్టరీకి జీవం పోశారని... రూ.18 కోట్లు గ్రాంట్ ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. వలంటీరుగా రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగుల కోసం రూ.4కోట్లు మంజూరు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కూడా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని, రైతులను, ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు, ఉపాధ్యక్షుడు పాండ్రంకి సంజీవరావు, మాజీ ఎంపీపీ కె.సూరిబాబురాజు, వైస్సార్‌సీపీ ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు అప్పాన సుబ్రహ్మణ్యం, చెరకు రైతు గుల్లిపల్లి జయపాల్, వైఎస్సార్‌సీపీ నాయకులు చలుమూరి సత్యారావు, నెక్కాలి సత్యనారాయణ, సుమారు 100మంది రైతులు పాల్గొన్నారు.


