● పిల్లలు లేరన్న అవహేళనతో మనోవేదన
● కేజీహెచ్‌లో పర్యవేక్షణ వైఫల్యం
● క్షణాల్లో స్పందించి మహిళను కాపాడిన బ్లూకోట్ పోలీస్
అల్లిపురం(విశాఖ): పిల్లలు లేరన్న కారణంతో కొందరు అవమానకరంగా మాట్లాడటంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ మహిళ వరుసగా రెండు రోజుల పాటు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. మొదటిసారి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ, సరైన పర్యవేక్షణ లేని కారణంగా అక్కడి నుంచి బయటకు వచ్చి రెండోసారి కూడా అదే యత్నానికి పాల్పడటం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపడింది. అయితే సకాలంలో స్పందించిన మహారాణిపేట బ్లూకోట్ పోలీస్ కానిస్టేబుల్ ఆమెను సురక్షితంగా రక్షించారు.
అవహేళనతో మొదలైన మనోవేదన
పార్వతీపురం నాయుడు వీధికి చెందిన మహాలక్ష్మి పిల్లలు లేరన్న కారణంగా కొందరు చేసిన అవమానకర వ్యాఖ్యలతో తీవ్ర మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె ఆర్కే బీచ్, నొవాటెల్ హోటల్ ఎదురుగా తొలిసారి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మహారాణిపేట పోలీసులు ఆమెను వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స కోసం చేర్పించారు.
కేజీహెచ్‌లో పర్యవేక్షణ కరవు.. మళ్లీ యత్నం
అయితే కేజీహెచ్‌లో ఆమైపె సరైన నిఘా లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయిన మహాలక్ష్మి, శనివారం కూడా మద్యం సేవించి సముద్రంలోకి వెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. మానసిక క్షోభలో ఉన్న రోగిని చికిత్స అనంతరం సరిగ్గా పర్యవేక్షించక పోవడం ఆస్పత్రి యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
క్షణాల్లో స్పందించిన బ్లూకోట్ పోలీస్
సముద్రంలోకి వెళ్తున్న మహిళను గమనించిన మహారాణిపేట బ్లూకోట్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న అనంతరం, విషయాన్ని మమతా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మమతకు తెలియజేశారు. ఆమె వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయం అందించారు.
చినవాల్తేరు మానసిక వైద్యశాలకు తరలింపు
మహాలక్ష్మి మానసిక స్థితి బాగాలేదని గుర్తించిన పోలీసులు, మమతా ట్రస్ట్ సహకారంతో ఆమెను చినవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి తగిన చికిత్స, పునరావాసం అందేలా చర్యలు తీసుకున్నారు.
సమయస్ఫూర్తికి అభినందనలు
పోలీసు కానిస్టేబుల్ చూపిన సమయస్ఫూర్తికి, మమతా ట్రస్ట్ మానవీయ స్పందనకు స్థానికులు అభినందనలు తెలిపారు. అయితే మానసిక క్షోభలో ఉన్న రోగులను కేజీహెచ్ వంటి ప్రధాన ఆస్పత్రుల్లో సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్లే ఈ ఘటన పునరావృతమైందని, ఇలాంటి కేసుల్లో ఆస్పత్రుల భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


