● ఘనంగా ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం
బొబ్బిలి: పట్టణంలో జానపద కళాకారులు పదం పాడుతూ కదం తొక్కారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాకారులంతా శ్రీ కళాభారతి, వేణుగోపాలస్వామి ఆలయ మండపం వేదికలుగా శనివారం పలు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. మహిళలు, పురుషులు, చిన్నారులనే తేడా లేకుండా వేదికలను పంచుకుని కళలంటే ఏమిటో చవిచూపారు. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో వందలాది మంది కళాకారులు ర్యాలీ నిర్వహించారు. శ్రీ కళాభారతి మున్సిపల్ ఆడిటోరియం కార్యవర్గం, రవిశంకర్ ఫైనార్ట్స్, బొబ్బిలి మల్టీ టాలెంట్ గ్రూప్, వేణుగోపాల నాట్యకళా మండలి, నట సమాఖ్య ఘంటశాల స్వరాంజలి ఆర్కెస్ట్రా తదితర కళాకారుల సంఘాల సభ్యులు ప్రదర్శనలు ఇచ్చారు. పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ యావత్తూ కోలాటం కళాకారులతో నిండిపోయింది. వారిచేతిలోని కర్రలు లయబద్ధంగా శబ్దం చేస్తుండగా అదే లయలో కళాకారులు నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. పట్టణ ప్రజలు కళారూపాలను తిలకించి తన్మయత్వం చెందారు. శ్రీ కళాభారతి మున్సిపల్ ఆడిటోరియంలో సీనియర్ కళాకారులకు గౌరవ సత్కారం చేశారు.


