● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
● పీజీఆర్‌ఎస్–రెవెన్యూ క్లినిక్‌లో
177 వినతులు స్వీకరణ
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్),రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్–రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 177 వినతులు స్వీకరించగా.. అందులో 74 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. భూ, సర్వే సమస్యలను కేవలం కార్యాలయ స్థాయి నివేదికలకే పరిమితం చేయకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, భూసర్వే తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలను కేవలం కార్యాలయ స్థాయి రికార్డులు, నివేదికల ఆధారంగా పరిష్కరించకుండా, అవసరమైన చోట చోట క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించిన తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా సమస్యకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చూట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు.
1100 ఫిర్యాదులపైనా దృష్టి
1100 టోల్‌ఫ్రీ సేవల ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని సూచించారు. 1100 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్డీవోలు, సీపీవో బాలాజీ, జిల్లా సర్వే ఎ.డి ఆర్.విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీపీవో మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 31ఫిర్యాదులు
విజయనగరం టౌన్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్‌లో భాగంగా అదనపు ఎస్‌పి 31 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్సై పాపారావు తదితరులు పాల్గొన్నారు.


