పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన వినతులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారుల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి, కేఆర్‌సీ ఉప కలెక్టర్ ధర్మరాజు, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్‌డీసీ బి.వెంకటరమణతో కలిసి మొత్తం 95 వినతులను స్వీకరించారు. అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించడంతో పాటు, సమస్య పరిష్కారంపై అర్జీదారుల సంతృప్తిని అధికారులు స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామీణ రహదారుల మరమ్మతులు, పాఠశాల భవనం, కాలువలు, నివాస స్థలం, వేతనబకాయిలు, భూ ఆక్రమణలు, వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాల మార్పు, పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
చట్టబద్ధమైన పరిష్కారమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా ఆలకించి, వాటికి చట్టబద్ధమైన పరిష్కారం చూపడమే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించి, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ కుటుంబ, ఆస్తి, భూవివాదాలు, మోసాలకు సంబంధించిన సమస్యలను ఎస్పీ ముందుంచారు. బాధితుల గోడును ఓపిగ్గా ఆలకించిన ఎస్పీ ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలించి అక్కడికక్కడే ఆయా స్టేషన్‌ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, నిష్పక్షపాత విచారణతో తక్షణ న్యాయం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు అందగా, డీసీఆర్‌బీ ఎస్సై శిరీష తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 22 వినతులు
సీతంపేట: ఐటీడీఏలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 22 వినతులు వచ్చాయి. పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ అర్జీలు స్వీకరించారు. సవర సిద్దమణుగు గ్రామంలో ఉన్న ప్రజల భూమిని ఆక్రమించి రహదారి నిర్మించిన విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అలాగే వారి అనుమతి లేకుండా విద్యుత్ స్తంభం ఏర్పాటు విషయమై పరిశీలించాలన్నారు. హౌసింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జన్నోడుగూడకు చెందిన సవర ప్రియ వినతిపత్రం అందజేశారు. పవర్ టిల్లర్‌లు ఇప్పించాలని అంబలగండికి చెందిన సత్యం కోరారు. జొనగదొండమానుగూడకు ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. కార్యక్రమంలో పీహెచ్‌వో ఎస్.వి గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈఓ నారాయుడు తదితరులు పాల్గొన్నారు.


