రాజాంలో మరో రౌడీషీటర్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రాజాంలో మరో రౌడీషీటర్‌ అరెస్టు

Aug 18 2026 12:57 AM | Updated on Aug 18 2026 12:57 AM

డబ్బులివ్వకపోతే చంపేస్తానని

గిఫ్ట్‌షాపు నిర్వాహకుడికి బెదింపు

రాజాం సిటీ: తాను ఒక రౌడీషీటర్‌నని, తనకు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ రాజాంలో ఓ గిఫ్ట్‌షాప్‌ యజమానిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న రౌడీషీటర్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ డి.నవీన్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. మండల పరిధి కంచరాం గ్రామానికి చెందిన పట్నాల కొండరాజు స్థానిక మెయిన్‌ రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా జయలక్ష్మి స్పోర్ట్స్‌ అండ్‌ గిఫ్ట్‌ షాప్‌ 17 ఏళ్లుగా నిర్వహిస్తు జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 13న మండల పరిధి గురవాం గ్రామానికి చెందిన రౌతు తేజ అనే రౌడీషీటర్‌ గిఫ్ట్‌షాపు వద్దకు వచ్చి రూ.1000 డిమాండ్‌ చేశాడు. తన వద్ద డబ్బులేదని షాపు యజమాని చెప్పగా తాను రౌతు తేజ అని, తనపై రాజాం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ నమోదైందని చెప్పాడు. తనకు డబ్బుగాని, దుకాణంలో ఏదైనా వస్తువు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. తన గురించి ఎవరికై నా చెబితే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆ మాటలకు భయపడిన కొండరాజు షాపులోని రూ.1300 విలువైన క్యారంబోర్డును అతనికి ఇచ్చాడు. ఈ విషయం బయట పెడితే నీ ఇంటికి, షాపునకు మధ్యదారిలో చంపేస్తానని మళ్లీ బెదిరించి క్యారంబోర్డు సెట్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం బాధితుడు రాజాం పోలీసులను ఆశ్రయించి సదరు రౌడీషీటర్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై సల్మాన్‌ బేగ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారని సీఐ తెలిపారు. నిందితుడు తేజను గురవాం సమీపంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement