డీఎస్సీ అక్రమాలకు నిరసనగా విజయనగరంలో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగుల రిలే నిరాహార దీక్ష
డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూ నిరుద్యోగులు కదంతొక్కారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు నారా లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో అవకతవకల వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు తారుమారయ్యాయని, ఎంత కష్టపడి చదివినా నిరుద్యోగులుగానే మిగిలిపోయామని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిరుద్యోగులకు కష్టాలు తప్పడంలేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3వేలు భృతిహామీ నెరవేర్చలేదని, విద్యార్థుల చదువులకు ఆధారమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేస్తున్నారని జెన్‌జీ యువత మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు పాలనకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలకు చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఎస్.కోటలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, విజయనగరంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, రాజాంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలేరాజేష్, పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపేవరకు నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నాలుగు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చేలా జెన్–జీ యువత పోరాటం సాగించాలన్నారు.
– సాక్షి నెట్‌వర్క్
ఉపాధ్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు
డీఎస్సీ అంటే ఆంధ్రా సివిల్స్ అనేవారు. అంత కష్టపడి చదివితేనే ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది. అటువంటి డీఎస్సీ ఉద్యోగాలను ఈ ప్రభుత్వం హేలనచేసింది. గతంలో ఉపాధ్యాయులుగా చేరి సర్వీసులో ఉన్నవారికి టెట్ తప్పనిసరిగా రాయాలని నిబంధనలు పెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని సంబరపడిన ఉపాధ్యాయులు దగా పడ్డారు. డీఎస్సీలో ఎటువంటి టెట్ లేకుండా అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. ఎన్నో కోట్లరూపాయల కుంభకోణంలా అనిపిస్తోంది. తపస్సు చేసి చదివిన టీచర్ ట్రైనీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. న్యాయం జరిగేవరకూ ఈ రిలే దీక్షలు చేస్తాం. – మరిశర్ల గంగారావు,
వైఎస్సార్‌సీపీ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు, రాజాం


