● ఘనస్వాగతానికి ఏర్పాట్లు
నెల్లిమర్ల రూరల్: గ్లాస్గోలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన జిల్లా క్రీడాకారుడు వల్లూరి అజయ్‌బాబు శుక్రవారం ఆయన స్వస్థలమైన నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి వస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన అజయ్‌కు అపూర్వ స్వాగతం పలికేందుకు క్రీడా సంఘాలు, గ్రామస్తులు, యువత సిద్ధమయ్యారు. సాధారణ కుటుంబం నుంచి కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగిన అజయ్‌బాబు.. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడం ద్వారా జిల్లా చరిత్రలో అరుదైన ఘనతను నమోదు చేశారు. దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తదితర ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విజయనగరం ఎత్తు బ్రిడ్జి నుంచి నెల్లిమర్ల మీదుగా కొండవెలగాడ గ్రామం వరకు ర్యాలీ ఉంటుందని అజయ్‌బాబు తండ్రి, సీనియర్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు.


