సంతకవిటి: మధ్యాహ్నభోజనంలో నాణ్యత కొరవడింది. పర్యవేక్షణ లోపించింది. ఫలితం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన కష్టాలు తప్పడం లేదు. ఇటీవల అంగన్‌వాడీ సెంటర్లకు పిల్లలు వచ్చిన గుడ్లును సరఫరా చేసిన విషయం మరువకముందే.. సంతకవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుళ్లిన గుడ్లును వడ్డించే ఘటన గురువారం చోటుచేసుకుంది. కంపు కొట్టిన గుడ్డు కూరను తినేందుకు విద్యార్థులు ఇష్టపడలేదు. కూరతో పాటు అన్నంను పారబోశారు. ఇంటర్ విద్యార్థులకు గుడ్డుకూర బదులు మిక్చర్ తెప్పించినప్పటికీ చాలామంది భోజనం చేసేందుకు నిరాకరించారు. అప్పటికప్పుడు ఉప్మా తయారు చేయించి వడ్డించారు. పాఠశాల విద్యార్థులకు మరే ఇతర ఏర్పాట్లు చేయక పోవడంతో చాలామంది పస్తులున్నారు. వీరికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బిస్కెట్ ప్యాకెట్‌లు అందజేశారు. తరచూ పాడైన గుడ్లునే సరఫరా చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని విద్యార్థులు, భోజన నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ 2 భాస్కరరావు స్పందిస్తూ విద్యార్థులకు వండిన గుడ్డుకూర కంపు కొట్టిందని తమ దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాలను సందర్శించామన్నారు. పీడీ మొదట భోజనం చేసి కూర బాగోలేదని తెలపడంతో ఎవరికీ వడ్డించలేదన్నారు.
పాడైన గుడ్లే కారణమన్న భోజన
నిర్వాహకులు
పస్తులతో విద్యార్థులు
బిస్కెట్ ప్యాకెట్లు అందజేసిన
ఉపాధ్యాయులు
ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉప్మా వడ్డింపు


