విజయనగరం గంటస్తంభం: ప్రజాసమస్యల పరిష్కారం, ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర విజయనగరం పట్టణంలో గురువారం ప్రారంభమైంది. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఫైనల్ వీధి, రాళ్లమాలపల్లి, సంజీవయ్యనగర్, బీటీఆర్ నగర్, సాయి కాలనీ, మార్క్స్‌నగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్ధుతు ధర, ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 వరకు విజయనగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికీ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు.


