విజయనగరం గంటస్తంభం: జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకురాలు వి.పద్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ ఆడిటోరియం వరకు హ్యాండ్‌లూమ్ వాక్ నిర్వహించి, అనంతరం చేనేత దినోత్సవ సభ జరపనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల ప్రదర్మనతో పాటు సీనియర్ చేనేత కార్మికులను సత్కరించనున్నామన్నారు. మై హ్యాండ్‌లూమ్..మై ప్రైడ్ నినాదంతో చేనేత వస్త్రాలను వినియోగించి చేనేతకు చేయూతనివ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ
● ఎస్సీ ఏఆర్ దామోదర్
విజయనగరం టౌన్: రహదారి భద్రత పట్ల అవగాహన, ఆచరణతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ 2026లో ఇప్పటివరకూ మోటారు వెహికల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 20,138 ఈ–చలానాలను విధించామన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, హెల్మెట్‌లను విధిగా ధరించాలని కోరారు. ప్రతిరోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.
భామిని: ఏనుగుల దాడిలో ఆస్తులు కోల్పోయిన బాధితులందరికీ తగిన పరిహారం అందించనున్నట్లు జిల్లా అటవీశాఖాదికారి జీఏపీ ప్రసూన గురువారం తెలిపారు. ఈ మేరకు భామిని మండలం పాలవలస గిరిజన గ్రామంలో నాలుగు ఏనుగుల దాడిలో సర్వం కోల్పోయిన గిరిజన బాధితులను ఆమె కలిసి ఓదార్చారు. నష్టాలనుంచి బయట పడడానికి నింబంధనల మేరకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ గ్రామంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తరలింపుపై బాధిత గిరిజనులు ఆమెకు మొర పెట్టుకున్నారు. తమ ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎఫ్‌ఓ ప్రసూన వెంట సబ్ డీఎఫ్‌ఓ సంజయ్ ఎల్లా, ఎఫ్‌ఆర్‌ఓ మణికంఠేష్, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణ, ఎఫ్‌బీఓ కేశవరావు, ట్రాకర్స్ ఉన్నారు.


