● ఎస్పీ ఏఆర్ దామోదర్
పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన భోగాపురం ఎయిర్‌పోర్టు సమీపంలో రహదారులను పరిశీలించారు. ఆక్టోపస్ ఐజీ శ్రీకాంత్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టీలతో కలిసి ప్రధానిపాల్గొనే సభకు బస్సులు వచ్చే మార్గాలను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. నిర్మాణ పనులు అవుతున్నందున ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు, ర్యాంపులు నిర్మించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విధులు నిర్వహించేందుకు కేటాయించిన ప్రాంతాలను విడిచిపెట్టవద్దన్నారు. బందోబస్తు నిమిత్తం వచ్చిన సిబ్బందికి వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభ నిర్వహించే ప్రాంతాలను, ఎయిర్‌పోర్టు ఆవరణలో పలు ప్రాంతాలను డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షణ్ణంగా పరిశీలించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, వెల్ఫేర్ డీఐజీ అన్భురాజన్, బెటాలియన్ కమాండెంట్ రవిశంకరరెడ్డి, విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


