● స్కానింగ్ కేంద్రాల నమోదు
తప్పనిసరి
● పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై
డీఎంహెచ్‌ఓ సమీక్ష
పార్వతీపురం రూరల్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టం (పీసీపీఎన్‌డీటీ–1994) ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ పి.విజయలక్ష్మి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక వైద్యారోగ్య కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ చట్టం పటిష్ట అమలు, కార్యాచరణపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు విధిగా ‘డిస్ట్రిక్ట్ అథారిటీ ఆఫ్ పీసీపీఎన్‌డీటీ’లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. లింగ వివక్షను అరికట్టేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా మండళ్లలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 1800 233–2447 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ వెల్ల డించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం జిల్లాలో మాతృ, శిశు మరణాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో డీఐఓ వై.విజయ్ మోహనన్, డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు కేవీఎస్.పద్మావతి, కె.విజయపార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, ప్రోగ్రాం అధికారులు జగన్మోహనరావు, రవికుమార్ రెడ్డి, ఎస్.కె.హఫీజా, వైద్యులు నాగరాజు, కమల, రవి, పద్మజ, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్, డీపీహెచ్‌ఏవో విజయలక్ష్మి పాల్గొన్నారు.


