కిలో ధర రూ.2 నష్టాల్లో రైతులు కోత ఖర్చులు రాని పరిస్థితి ఆవేదనలో సాగుదారులు పెట్టుబడైనా వస్తే చాలంటున్న రైతన్నలు
ధర పతనంతో ఇబ్బందులు
కూలి పనికి వెళ్లిపోతేనే మంచిదనిపిస్తోంది...
అప్పులు చేసి కూలీలకు ఇస్తున్నాం..
రామభద్రపురం:
బెండ పంట సాగు చేసే రైతుల పరిస్థితి ఒక్కసారిగా కుదేలైంది. ఈ ఏడాది పంట పండిందని సంబరపడిన రైతుకు ధర కుదేలు చేస్తోంది. రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో బెండ కాయల ధర పూర్తిగా పతనమైంది. రెండు వారాల కిందట 15 నుంచి 18 కిలోలు ఉండే బెండ కాయల క్రేట్ ధర రూ.300 వరకు పలకగా ప్రస్తుతం ఒక్కసారి ధర పతనమై ఇదే క్రేట్ ధర రూ.30 నుంచి 40లకు పడిపోయింది. అంటే కిలో బెండ కాయలను కిలో రూ.2లకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పంట పొలంలో ఉంచాలో.. తొలగించాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈ ధరకు కనీసం కోత ఖర్చులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. దిగుబడులు సమృద్ధిగా వస్తున్న సమయంలో ధరలిలా పతనం కావడంతో కనీసం మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా దక్కే పరిస్థితి లేక పొలాల్లోనే పంటను వదిలేసే దుస్థితి ఏర్పడింది. పంట సాగులో విత్తనం, ఎరువులు, పురుగు మందుల ధరలతో పాటు కూలీ ఖర్చులు కూడా పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అంతా సన్న, చిన్న కారు రైతులే..
ఏటా సంభవిస్తున్న వాతావరణ పరిస్థితులు, వరిలో నష్టాలు చవిచూస్తుండడంతో ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై ఈ ప్రాంత రైతులు దృష్టి సారించారు. జిల్లాలో సుమారు 200 హెక్టార్లలో బెండ సాగు చేస్తుండగా వారిలో చిన్న, సన్నకారు రైతులే అధికం. వీరు 10 సెంట్లు నుంచి 50 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రామభద్రపురం, బొబ్బిలి, మెరకముడిదాం, గజపతినగరం, జామి, ఎస్.కోట, కొత్తవలస మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ సారి సరైన వర్షాలు లేకపోవడం.. ధైర్యం చేసి కొద్దిపాటి వనరులతో బెండ పంట సాగు చేశారు. రెండు మూడు వారాల కిందట బాగానే ఉన్న ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరల స్థిరీకరణ లేక రోజుకో ధర పలకడంతో కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో నష్టాలు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. అంతరరాష్ట్ర మార్కెట్‌లో స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, తెలంగాణకు చెందిన వ్యా పారులు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంటారు.
పొలం సిద్ధం చేయడం.. విత్తనం నాటడం, ఎరువు లు, కలుపు నివారణ చర్య లు తదితర అన్నీ కలుపు కుంటే రైతుకు ఎకరాకు రూ.40 వేలు నుంచి రూ.50 వేలు పెట్టుబడి అవుతుంది. ఇంత ఖర్చు చేసి బెండ సాగు చేస్తే కాయలు కోసే సమయానికి మార్కెట్‌లో ధరలు పతనమవుతున్నాయి. 20 రోజుల క్రితం రూ. 300 పలికిన బెండ క్రేట్ ధర ప్రస్తుతం రూ.30ల నుంచి రూ.40 లకు పడిపోయింది. రోజుల వ్యవధిలోనే ధరల్లో భారీ తేడా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు కూడా రావడం లేదు. ఇంత దారుణంగా ధరలు పడిపోవడం తానెప్పు డు చూడలేదు. కోయకుండా పొలంలో వదలలేక కోసుకొస్తున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
– పెదిరెడ్ల శ్రీనివాసరావు, రైతు, రామభద్రపురం
ఆదివారం 10 క్రేట్ ల బెండకాయలు మార్కెట్‌కు పట్టుకెళ్లాం. ఒక్కో క్రేట్ రూ.30లు చొప్పున్న వ్యాపారికి బతిమలాడి అమ్మాల్సి వచ్చింది. అమ్మిన రూ.300లలో మార్కెట్‌కు ఆసీలు రూ. 100లు, రవాణా ఖర్చులు రూ.100లు చెల్లించి మేము రూ.100లు ఇంటికి పట్టుకెళుతున్నాం. ఇప్పుడు ఎరువులు, పురుగు మందుల ధరలతో పాటు కూలీల ఖర్చులు చూసుకుంటే మా కష్టానికి ఏమి మిగలడం లేదు. పంటలు సాగు మానే సి కూలీ పనికి వెళ్లిపోతేనే మంచిదనిపిస్తోంది.
– గొర్లె స్వాతి, గౌరి, బెండ రైతులు,
రామభద్రపురం
కాపుకొచ్చిన బెండ పంటను చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లభించడం లేదని బాధ పడాలో తెలియడం లేదు. కూలీలకు పురుగు మందులు, ఎరువులకు అప్పు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. కష్టపడి పంట పండించాం. దిగుబడి బాగా వస్తోంది. మార్కెట్లో అమ్మితే కనీసం కూలీ ఖర్చులకు సరిపడేంత డబ్బులు కూడా రావడం లేదు.
– కనకల సన్యాిసినాయుడు, రైతు ఆరికతోట


