విజయనగరం రూరల్: విద్యార్థులకు ఉపాధి కల్పనలో భాగంగా పరిశ్రమ – విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా జేఎన్‌టీయూ జీవీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్‌లు ఆదివారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నాయి. స్థానిక జేఎన్‌టీయూ జీవీ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో జేఎన్‌టీయూ జీవీ వీసీ వి.వి.సుబ్బారావు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, గ్లోబల్ సీఈవో మయూర్ పట్నాల ఒప్పంద పత్రాలను అందించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందంతో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను విస్తరించడం, పరిశ్రమ – విద్యా సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువత, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఇతర అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జేఎన్‌టీయూ జీవీ, అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాల శిక్షణ, కెరీర్ మార్గదర్శకత్వం, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక శిక్షణ, ఇంటర్న్‌షిప్, క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఉపాధి మేళాలు, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అదనంగా స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల అభివృద్ధి, హ్యకథాన్‌లు, వర్క్‌షాపులు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, పరిశోధన, పరిశ్రమలతో సంయుక్త కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య అవకాశాలపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు జేఎన్‌టీయూ జీవీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని, విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ, పరిశ్రమ అనుసంధానం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


