సాక్షి, టాస్క్‌ఫోర్స్:
జిల్లా విద్యాశాఖలో కొన్నాళ్లుగా అవినీతికి జై‘చిరంజీవ’ అన్న పదం వినిపిస్తోంది. విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజనం నుంచి పాఠశాలల భవన నిర్మాణ కాంట్రాక్టుల వరకు అన్నింటా ఆయనకు వాటాలు వెళ్లాల్సిందే. దీనికోసం ఆయనకు నచ్చిన, మెచ్చిన వారిని ఉన్నతాధికారి పదవుల్లో కూర్చోబెడతారు. దానికి కూడా తాయిళాలు ఇవ్వాల్సిందేనట. ఉన్నత విద్యావంతుడిగా.. ‘పట్టభద్రుల’ ప్రతినిధిగా సమాజం దృష్టిలో మంచిగా మెలగుతూనే... మరో రూపంలో విద్యాశాఖకు మంజూరైన నిధులు కై ంకర్యం చేస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. పొరపాటున ఎవరైనా ప్రశ్నించినా... ఎక్కడైనా ఎదురుతిరిగినా ‘చినబాబు’కు తను ఏది చెబితే అదే... మీ పోస్టింగ్ ఉండదంటూ కంటిచూపుతోనే హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్రలోని విద్యాశాఖాధికారులు... సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోర్డినేటర్లు (ఏపీసీ) అంతా అవినీతికి జై‘చిరంజీవ’ అంటూ తలాడిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరంలో ఒకే అధికారి చేతిలో రెండు కీలక పోస్టులు పెట్టి దందా సాగిస్తున్నారన్న చర్చ విద్యాశాఖలో సాగుతోంది.
● ఆ సీటులో పాతుకుపోయి...
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమిస్తుంది. అయితే, ఆ బాధ్యతలను పక్కనబెట్టి ఓ ఉపాధ్యాయుడు ఏళ్లతరబడి పాఠశాలకు దూరంగా ఉండి జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో డిప్యుటేషన్ పేరుతో, మరికొంతకాలం అనధికారికంగా కొనసాగుతూ ఉపాధ్యాయేతర పనుల్లోనే నిమగ్నం కావడం మొన్నటివరకు ఉపాధ్యాయవర్గాల్లో చర్చకు దారితీసింది. విజయనగరం పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన ఈ టీచర్ సెక్టోరియల్ అధికారిగా సమగ్ర శిక్షలో కొనసాగారు. ఆయన స్థాయి టీచర్ అయినప్పటికీ ఆ విభాగంలో ఆయన హవా జిల్లా స్థాయి అధికారులను మించి ఉండేదన్నది కేజీబీవీ సిబ్బంది మాట. ఆయన వేలు పెట్టని విభాగం ఉండదని, ఇంజినీరింగ్ విభాగం చేపట్టే పనులు.. వారి బిల్లులు.. కస్తూర్బా స్కూళ్ల పర్యవేక్షణ.. ఒకటేమిటి ఇలా అన్ని విభాగాలపైనా ఆయనదే పెత్తనం అని.. ఏళ్లతరబడి ఇక్కడ పాతుకుపోయి ఉండడంతో విద్యాశాఖలో అన్ని లొసుగులు.. లోతుపాతులు తనకు తెలుసనీ... ఎవర్ని ఎక్కడ ఎలా వంచాలి.. లొంగదీయాలి.. ఎక్కడ ఎంత బిల్లింగ్ వేయాలి అనేది కూడా ఆయనే నిర్ణయిస్తారన్న చర్చ సాగుతోంది. సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆయన అనుమతి, సూచన లేకుండా ఏ ఫైల్ కూడా కదిలే పరిస్థితి లేదని సమాచారం. ఆయనను ఇటీవల సమగ్ర శిక్ష నుంచి రిలీవ్ చేసినప్పటికీ, మళ్లీ అక్కడికే చేరాలనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖాధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా...
ఇటీవల జిల్లా విద్యాశాఖలో సెక్టోరియల్ అధికారుల పోస్టులు భర్తీచేశారు. గత నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమే అర్హులు. అయితే, ఎస్జీటీలు కూడా దీనికి అర్హులుగా ప్రభుత్వం కొత్తగా జీఓ జారీచేసింది. దీని వెనుక కూడా రాష్ట్రస్థాయిలో పెద్ద లాబీయింగ్ జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా ఈ పోస్టుల్లో భర్తీచేసేవారికి కంప్యూటర్ పరిజ్ఞానం పూర్తిస్థాయిలో ఉండాలి. అయితే, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోయిన వారికి సైతం పోస్టులిచ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఇందులోనూ పెద్దమొత్తంలో డబ్బులు చేతులుమారినట్టు సమాచారం. జిల్లాలో విద్యాశాఖను సైతం అవినీతిమయంగా మార్చిన ‘పెద్ద మాస్టారి’ లీలలు ఉపాధ్యాయవర్గాల్లో చర్చకు దారితీశాయి.
జిల్లాలో 26 వరకు కస్తూర్బా స్కూళ్లున్నాయి.. వీటి బడ్జెట్.. నిర్వహణ.. పర్యవేక్షణ అంతా సమగ్ర శిక్ష విభాగం చూస్తుంది. దీంతోబాటు స్కూళ్లలో చేపట్టే ఇంజినీరింగ్ పనులను కూడా ఈ విభాగమే చూస్తుంది. మొత్తానికి ఇన్ని పనులు ఒక్కరే చేయడం కష్టం కావడంతో తనకు అనుకూలంగా ఉండే ఇద్దరు ముగ్గురు టీచర్లను తన కోటరీలో పెట్టుకుని మా మంచి ‘మాణిక్యం’లా ఓ విద్యాధికారి కథనడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇష్టానుసారం టీచర్ల డిప్యుటేషన్లు.. మోడల్ స్కూళ్ల పోస్టింగులు ఇచ్చేసి బాగా దండేశారన్న అపప్రద మూటగట్టుకున్న విద్యాశాఖ ఇప్పుడు ఏకంగా సిండికేటుగా మారిందన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.


