● బొబ్బిలి ఆర్డీఓ రామమోహన్‌రావు
బాడంగి: ఈ నెల14వ తేదీ అర్ధరాత్రిలోగా ఎన్యూమరేషన్ ఫారాలిచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోపోతే అలాంటివారి ఓట్లు రద్దవుతాయని ఆర్డీఓ రామమోహన్‌రావు హెచ్చరించారు. బాడంగి మండలంలో సర్ నమోదు తీరును ఆయన శనివారం పరిశీలించారు. బొబ్బిలి నియోజకవర్గంలో 80.17 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. కోడళ్ల విషయంలో వారి తల్లిదండ్రులు, తాతలు, స్వగ్రామం, నియోజకవర్గం వంటి విరాలసేకరణలో జాప్యం జరుగుతోందన్నారు. బాడంగిలో 79.09 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, శతశాతం పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ కె.వరప్రసాద్, ఎంపీడీఓ డి.వి.శ్రీలత, బీఎల్‌ఓలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
ఘనంగా ఆర్టీసీ ఈయూ వజ్రోత్సవ వేడుక
విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)75వ వజ్రోత్సవ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం డిపో ప్రాంగణంలోని సంఘ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి హాజరై యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ గత 74 ఏళ్లుగా ఉద్యమాలు, పోరాటాలతో ఆర్టీసీని, కార్మికుల ఆర్థిక, సామాజిక హక్కులు కాపాడుతున్న ఘనత ఈయూదేనన్నారు. 1952లో ఉద్యోగుల భాగస్వామ్యంతో సీసీఎస్ సంస్థ ఏర్పాటు, కారుణ్య నియామకాల సాధన, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ, 21 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి చారిత్రాత్మక విజయాలను యూనియన్ సాధించిందని గుర్తుచేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలోనూ యూనియన్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపో కార్యదర్శి శ్రీనివాస్, డిపో అధ్యక్షుడు కె.ఎన్.స్వామి, వివిధ డిపోల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


