విజయనగరం గంటస్తంభం: మున్సిపాలిటీల్లో శాశ్వత స్వభావం గల పనుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి టీవీ రమణ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌పీఆర్ శ్రామిక భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. మున్సిపల్ సేవల ప్రైవేటీకరణకు సంబంధించిన జీఓలు 975, 673ను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రతతో పాటు గ్రాట్యుటీ, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు భాస్కరరావు, జగన్మోహన్‌రావు, జి.కుమారి, బి.రమణ తదితరులు పాల్గొన్నారు.
బిడ్డకు బిడ్డకు దూరం
పాటించాలి : డీఎంహెచ్‌ఓ
విజయనగరం ఫోర్ట్: బిడ్డకు బిడ్డకు సరైన దూరం పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో సంతాన ఉత్పత్తి రేటును 1.9 కాగా రాష్ట్రంలో 1.5, జిల్లాలో 1.58 గా ఉందన్నారు. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి లక్కీ డీప్ ద్వారా ప్రోత్సాహక నగదును వారోత్సవాల్లో అందించనున్నట్టు తెలిపారు. మాత, శిశు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అర్చన దేవి, డెమో చిన్నతల్లి, ఎస్‌ఓ గిరిగణేష్ తదితరులు పాల్గొన్నారు.
బొలెరోను ఢీకొన్న లారీ
● ఇద్దరికి గాయాలు
గరుగుబిల్లి: మండలంలోని పార్వతీపురం – శ్రీకాకుళం ప్రధాన రహదారి పరిధిలో చిలకాం గ్రామ సమీపంలో లారీ బొలెరోను ఢీకొన్న ప్రమాదంలో శనివారం ఇద్దరు గాయాల పాలయ్యారు. స్థానిక ఎస్‌ఐ ఫకృద్దీన్ తెలిపిన వివరాలు.. వీరఘట్టం నుంచి పార్వతీపురం వైపు వస్తున్న లారీ, పార్వతీపురం వైపు నుంచి వీరఘట్టం వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్ పాంట్రంకి రాంబాబుతో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారీ అయ్యాడు.
మామ, కోడలు ఆత్మహత్యా యత్నం
● మనస్తాపంతో మామ..
నిందలు పడలేక కోడలు!
పార్వతీపురం రూరల్ : బలిజిపేట మండలంలోని అజ్జాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన మామ, కోడలు మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించారు. గ్రామానికి చెందిన వృద్ధుడు సుంకర దాలియ్య కుమారుడు మృతి చెందగా.. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేసి కోడలు పైడితల్లి, మనవడు, మనవరాలితో కలిసి ఉంటున్నాడు. 80 సంవత్సరాల వృద్ధాప్యంలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న వేదనతో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వంగ తోటకు ఉపయోగించే పురుగుల మందు తాగి దాలియ్య ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు ఆయనను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగినప్పుడు కోడలు పైడితల్లి పని నిమిత్తం బొబ్బిలి వెళ్లింది. తిరిగి గ్రామానికి చేరుకున్న ఆమెను.. మామను సరిగ్గా చూసుకోవడం లేదంటూ ఆడపడుచులు, స్థానికులు మందలించారు. ఈ నిందలు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మధ్యాహ్నం 3 గంటల సమయంలో పురుగుల మందు సేవించింది. గమనించిన కుటుంబ సభ్యులు పైడితల్లిని కూడా జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మామ, కోడలు ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


