సాలూరు: గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు పట్టణంలో ఏర్పాటు చేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లో శిక్షణలు నిలిచిపో నున్నాయి. ఈ కేంద్రంలో పలువురు గిరిజన నిరుద్యోగ యువకులు వివిధ రంగాల్లో శిక్షణ పొంది శ్రీసిటీ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉపాధి పొందారు. కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఈ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో గిరిజన యువత ఉద్యోగ, ఉపాధి దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గిరిజన యువత ఆందోళన చెందుతున్నారు. ఈ వైటీసీ వేలాది మంది గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు బాటలు వేసింది. ఈ పరిస్థితుల్లో దీన్ని మూసివేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం యువత ఆశలపై నీళ్లు చల్లడమేనని పలువురు విమర్శిస్తున్నారు.
గర్భిణుల వసతిగృహానికీ గండి!
గిరిశిఖర గర్భిణుల వసతిగృహాన్ని ఈ వైటీసీలోనే నిర్వహించేవారు. దేశ స్థాయిలోనే ఈ వసతిగృహం గుర్తింపు తెచ్చుకుంది. కూటమి ప్రభుత్వంలో ఈ వసతిగృహంలో పని చేసుతన్న సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులను తొలగించారు. ఈ పరిస్థితుల్లో దీన్ని క్రమేణ నిర్వీర్యం చేశారనే విమర్శలను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంది.
లక్ష్యం ఏమైనట్టు?
గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని అసలు లక్ష్యం పక్కన పెట్టే విధంగా ప్రభుత్వం పని చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి శిక్షణ కోసం ఎదురు చూస్తున్న గిరిజన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కేంద్రాన్ని ఇలా నిర్వీర్యం చేయడం సమంజసం కాదని విమర్శిస్తున్నారు. ఇది గిరిజన అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అంశంగా చర్చించుకుంటున్నారు. ఇకనైనా పాలకులు స్పందించి గిరిజన యువతకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగేలా తగు చర్యలు తీసుకుని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కాపాడాలని గిరిజన సంఘాల నాయకులు, యువత కోరుతున్నారు.
గిరిజన నిరుద్యోగ యువత ఆశలపై కూటమి నీళ్లు
ఇకపై వైటీసీలో పద్మాపురం ఆశ్రమ పాఠశాల నిర్వహణ
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆశ్రమ పాఠశాల ఉద్యోగులకు తాళాల అప్పగింత
తాళాల అప్పగింత
పాచిపెంట మండల కేంద్రంలో తరలిస్తున్న పద్మాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఈ వైటీసీ భవనంలో నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే అధికారులు ఈ భవనాన్ని పరిశీలించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం ఈ పాఠశాల ఇక్కడకు మారే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైటీసీ తాళాలను పద్మాపురం ఆశ్రమ పాఠశాల ఉద్యోగులకు అప్పగించినట్టు సమాచారం.


