విజయనగరం రూరల్: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌లో విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూఏపీ) జట్టు క్రికెట్ టోర్నీ రన్నరప్‌గా నిలిచింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు ఒడిశాలోని పలు ఇంజినీరింగ్ కళాశాల జట్లు ఈ అంతర్ కళాశాలలో పాల్గొనగా సీటీయూఏపీ జట్టు రన్నరప్‌గా నిలవడంతో భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్ చేతుల మీదుగా ట్రోఫీ, రూ.25 వేలు నగదు అందుకున్న కెప్టెన్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు జట్టు సభ్యులను ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్ టి.శ్రీనివాసన్, ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా, ప్రొఫెసర్లు, సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్లు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని అన్నారు. క్రీడా స్ఫూర్తి, జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు విద్యార్థుల భవిష్యత్ విజయాలకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. సీటీయూఏపీ విద్యార్థులు విద్యా రంగంతో పాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తుండటం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయం క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.


