వెనకబడ్డారు ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

వెనకబడ్డారు ‘సర్‌’

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

వెనకబడ్డారు ‘సర్‌’

సాలూరు నియోజకవర్గంలో ఓటర్లకు

అవగాహన కల్పించడంలో అధికారుల ప్రణాళికాలోపం

కొటియా గ్రామాల్లో భాష సమస్య, ఒడిశా ఆధార్‌తో బీఎల్‌ఓల ఇబ్బందులు

సాలూరు: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమం పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. సర్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రజలు విమర్శిస్తున్నారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఇంటింటికీ తిరిగి బూత్‌స్థాయి అధికారులు,ఏజెంట్లు ఎందుకు ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో పలువురు ప్రజలు ఉన్నారు. ఫారాలు ఇచ్చి వివరాలు పూర్తిచేసి ఇవ్వాలని ఓటర్లకు బీఎల్‌ఓలు చెబుతున్నారు. వాటిని ఎలా నింపాలో కూడా తెలియని పరిస్థితి పలువురికి ఉంది. చాలావరకు బీఎల్‌ఓలు, సహాయకులు ఈ ప్రక్రియలో ఓటర్లకు సహాయ పడుతున్నారు. పోలింగ్‌ బూత్‌లో ఉన్న ఓటరు జాబితాలో పంచాయతీ గ్రామంతో పాటు అనేక మధుర గ్రామాలు ఉండడంతో వాటన్నింటిని వెతుక్కునేందుకు సిబ్బంది తలలుపట్టుకుంటున్నారు. కొటియా గ్రూప్‌ గ్రామాలు, పలు గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు తెలుగు భాష రాకపోవడంతో బీఎల్‌ఓలు ఇబ్బందిపడుతున్నారు. అక్కడ ఇటు తెలుగు,అటు గిరిజనుల భాష తెలిసిన వ్యక్తితో ఈ ప్రక్రియ గురించి చెబుతున్నారు. పలువురు గిరిజనులు ఒడిశా ఆధార్‌లను కలిగి ఉండడం వంటి కారణాలతో బీఎల్‌ఓలకు తిప్పలు తప్పడం లేదు.

ఓటర్ల సహనానికి పరీక్ష

ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ఓటర్లు, సిబ్బంది సహనానికి పరీక్షగా మారింది. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా చేస్తున్న ఈ ప్రక్రియపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.ఇంత పెద్ద కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నాణ్యతగా జరగాలంటే దానికి తగిన సమయం ఇవ్వాలే తప్ప ఇంత తక్కువ కాలంలో ఇంతపెద్ద ప్రక్రియ పూర్తిచేసినా తప్పులు,పొరపాట్లు అధికంగా జరిగే అవకాశం ఉంటుందనేది ప్రజల వాదన.

అవగాహన కల్పించడంలో విఫలం

అయితే ఈ కార్యక్రమంపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయి విజయవంతం కాలేదని ప్రజల నుంచి వస్తున్న విమర్శ. మైక్‌ల ద్వారా తెలపడం, గ్రామాల్లో దండోరా వేయించడం వంటి ప్రచారాలు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.కాగా రెండు ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వాల్సి ఉండగా, పలు ప్రాంతాల్లో కేవలం ఒకటి మాత్రమే ఇస్తున్నారని తెలియవస్తోంది. దీనివల్ల ఆ ఒక్క ఎన్యుమరేషన్‌ ఫారాన్ని ఓటరు సక్రమంగా నింపి ఇచ్చినా, ఏవైనా కారణాలతో వెరిఫికేషన్‌ అధికారులు రిజెక్ట్‌ చేసినా తాము వివరాలు సక్రమంగానే ఇచ్చామని చెప్పే ఆధారం ఓటరు దగ్గర ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నత్త నడకన..

జిల్లాలోనే అత్యంత తక్కువగా సర్‌ కార్యక్రమం సాలూరు నియోజకవర్గంలోనే జరుగుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 50 శాతం డిజిటలైజేషన్‌ దాటగా, సాలూరు నియోజకవర్గం ఇంకా ఆదివారం సాయంత్రానికి 49.5 శాతం వద్దనే నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement