విజయనగరం అర్బన్:
విద్యకు సంబంధించి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్భాటాలకూ, క్షేత్ర స్థాయి వాస్తవాలకూ పొంతన లేకుండా పోయింది. శుక్రవారం నుంచి జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. మొదటి రోజే విద్యార్థుల చేతుల్లో ‘స్టూడెంట్ కిట్లు’ పెడతామంటూ అమాత్యులు, అధికారులు చేసిన ప్రగల్భాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. విద్యా సామగ్రి సరఫరాలో తీవ్ర గందరగోళం నెలకొంది. కీలకమైన యూనిఫాంలు, బ్యాగులు, బెల్టులు, బూట్లు, నోట్‌బుక్స్ పాఠశాలలకు చేరనేలేదని నివేదికలు చెబుతున్నాయి. వేలాది మంది పేద విద్యార్థులు మొదటి రోజే పాత బట్టలతో, ఒట్టి చేతులతో బడికి వెళ్లాల్సిన దయనీయ స్థితిని కూటమి ప్రభుత్వం కల్పించిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెల్టుల కొరత
జిల్లాలో విద్యార్థులకు 72,302 బెల్టులు అవసరం కాగా.. వచ్చింది కేవలం 33,988 మాత్రమే. దాదాపు 38 వేల మందికి పైగా విద్యార్థులకు బెల్టులు లేవు.
బూట్ల బేజారు
జిల్లాలో 1,11,199 జతల బూట్లకుగాను కేవలం 36,910 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 74 వేల మందికి పైగా విద్యార్థుల కాళ్లకు రక్షణేది?
పుస్తకాలకూ కటకట
విద్యార్థులకు అత్యంత కీలకమైన నోట్‌బుక్స్ సరఫరాలోనూ భారీ లోటు కనిపిస్తోంది. జిల్లాకు 7,16,762 నోట్‌బుక్స్ అవసరం కాగా ఇప్పటి వరకు 4,54,935 మాత్రమే వచ్చాయి. ఇంకా 2.61 లక్షల నోట్‌బుక్స్ ఎప్పుడొస్తాయో? ఎవరికిస్తారో అధికారులకే తెలియాలి. డిక్షనరీలు ఇచ్చామని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి.
19 మండలాల్లో యూనిఫాం ‘సున్నా’!
జిల్లాలోని బాడంగి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, డెంకాడ, గజపతినగరం, గంట్యాడ, కొత్తవలస, మెంటాడ, రామభద్రపురం, రాజాం తదితర 19 మండలాల్లో యూనిఫాంల సరఫరా అసలు ప్రారంభమే కాలేదు. పాఠశాలల రీ–ఓపెనింగ్ తేదీ ముందుగా నిర్ణయించినా ఇంతవరకు సరఫరా సంస్థలను ఎందుకు గద్దించలేదు? కొట్లాది రూపాయల టెండర్లలో జరిగిన లోపాయికారీ ఒప్పందాల వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నేడు మోగనున్న బడి గంట
కిట్ల జాడ లేదు..
బ్యాగులు నిల్.. బూట్లు,
యూనిఫాం సగమే..
నోట్ పుస్తకాలూ అరకొరగానే..
విద్యార్థుల జీవితాలతో సర్కారు
చెలగాటం
తల్లిదండ్రుల ఆగ్రహం
తల్లిదండ్రుల ఆందోళన.. అధికారుల దాటవేత
పాఠశాలలు తెరచుకుంటున్నాయి... కానీ మా పిల్లల కిట్లు మాత్రం ఇంకా మండలాలకు కూడా చేరలేదు. ఈ ఏడాది అసలు స్టూడెంట్ కిట్లు ఇస్తారా? లేక పాత వాటితోనే సరిపెట్టుకోవాలా..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలు నిర్లక్ష్యం వహించాయని ఉపాధ్యాయు, విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే అన్ని వస్తాయి.. అంటూ సగటు సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్క బ్యాగూ రాలేదు..
జిల్లాలో మొత్తం 1,11,199 మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. పంపిణీ తీరు దారుణంగా ఉంది. జిల్లాలోని 27 మండలాల్లో ఒక్కటంటే ఒక్క మండలానికి కూడా ఇప్పటివరకు బ్యాగులు సరఫరా కాలేదు. లక్షకు పైగా విద్యార్థులు తమ పుస్తకాలను ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. యూనిఫాంల పరిస్థితి మరింత ఘోరం. అవసరమైన కిట్లలో కేవలం 46,759 యూనిఫాంలు మాత్రమే మండలాలకు చేరాయి. అంటే ఇంకా 64,440 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందే పరిస్థితి లేదు. బడి తెరిచే నాటికి కనీసం సగం మందికి కూడా బట్టలు కుట్టించలేకపోయారంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలు నీటి మూటలుగా మిగిలాయనే విమర్శలు వస్తున్నాయి.


