● ఆ సీటులో మీరు కూర్చోవద్దు..
● తహసీల్దార్‌కు టీడీపీ నేతల హుకుం
● డీటీ కుర్చీలో కూర్చుంటున్న తహసీల్దార్
● కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు
● పోస్టింగ్ ఆర్డర్ పడి వారం గడుస్తున్నా.. ఇదే పరిస్థితి
● ఎమ్మెల్యే కళా నియోజకవర్గంలో తహసీల్దార్ దుస్థితి ● నిలిచిపోయిన రెవెన్యూ సేవలు
చీపురుపల్లి: ‘తహసీల్దార్ కుర్చీలో మీరు కూర్చోవద్దు.. మీకు ఎవరు పోస్టింగ్ ఇచ్చారు... మేము వేరొకరికి పోస్టింగ్ ఇస్తాం.. మీరు అంతవరకు తహసీల్దార్ కుర్చీలో కూర్చోవద్దు... అంతే కాదు.. ఎక్కడికై నా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండండి..’ ఇదీ ఎమ్మెల్యే కళా వెంకటరావు సొంత నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో టీడీపీ నాయకుల మార్క్ పాలన. ఇక్కడ కొత్తగా పదోన్నతి పొంది తహసీల్దార్ పోస్టింగ్ ఆర్డర్‌తో వచ్చిన సూర్యకాంతంకు టీడీపీ నేతలు పై విధంగా హుకుం జారీ చేశారు. ఇదేంటి ఇలా జరిగిందని తహసీల్దార్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే మా వాళ్లు ఏం చెబితే అదే.. అనడంతో ఆమెకు అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో చేసేదేమీ లేక తహసీల్దార్‌గా స్వయాన కలెక్టర్ ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ డిప్యూటీ తహసీల్దార్ కుర్చీలోనే కూర్చుంటూ ఎలాంటి సంతకాలు చేయకుండా ఎక్కడ పోస్టింగ్ వేస్తారో తెలియక లోలోపల మదన పడుతూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
వారం క్రితమే పోస్టింగ్
జిల్లా వ్యాప్తంగా 11 మంది డిప్యూటీ తహసీల్దార్‌లకు తహసీల్దార్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఈ నెల 4న కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే చీపురుపల్లి డిప్యూటీ తహసీల్దార్‌కి తహసీల్దార్‌గా పదోన్నతి లభించింది. దీంతో అప్పటికే తహసీల్దార్‌గా ఉన్న ధర్మరాజు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించడంతో క్లియర్ వెకెన్సీగా ఉన్న చీపురుపల్లి తహసీల్దార్‌గా ఆమెను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.
కలెక్టర్ ఆర్డర్ బేఖాతరు
సాక్షాత్తూ కలెక్టర్ ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్‌కు గౌరవం లేదని రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా ఎమ్మెల్యే చెబితే తప్ప అధికారులు కుర్చీలో కూర్చునే పరిస్థితి జిల్లాలో లేకుండా పోయిందని వాదన వినిపిస్తోంది. తహసీల్దార్ స్థాయి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పోస్టు పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ఉద్యోగుల సంగతి ఏంటనే ప్రశ్న రెవెన్యూ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.
తప్పని అవస్థలు
ఇదిలా ఉంటే తహసీల్దార్‌గా పోస్టింగ్ ఆర్డర్‌తో వచ్చినప్పటికీ టీడీపీ నాయకులు ఆ కుర్చీలో కూర్చోవద్దని చెప్పడంతో జిల్లా అధికారులు సదరు తహసీల్దార్‌కు డిజిటల్ సిగ్నేచర్ అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల కుల, ఆదాయ ధ్రువీకరణలు నుంచి ఇతర రెవెన్యూ పనులు అన్ని నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
వారం
రోజులుగా
డీటీ
కుర్చీలోనే..
తహసీల్దార్‌గా పదోన్నతి లభించడం, వెంటనే పని చేస్తున్న చోటే పోస్టింగ్ రావడంతో తహసీల్దార్ సూర్యకాంతం అదే రోజు సాయంత్రం వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే అధికార టీడీపీ నేతలను కలిసేందుకు వెళ్లారు. పాపం పూలబోకెలు, జీడిపప్పు ప్యాకెట్లు తీసుకు వెళ్లినప్పటికీ అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మీరు ఎందుకు వచ్చారు.. మాకు అవసరం లేదు. కుర్చీలో కూర్చోవద్దు అంటూ టీడీపీలో మూడు మండలాల్లో పదవులు అలంకరించిన ఓ నాయకుడు ఆమెకు తేగెసి చెప్పేశాడు. పదోన్నతి పొంది సంతోషంలో ఉన్న ఆమెకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు, ఎమ్మెల్యే కార్యాలయానికి చెప్పుకున్నప్పటికీ ఎలాంటి సపోర్టు లేకపోవడంతో వారం రోజులుగా డీటీ కుర్చీలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


