● ఏపీ జేఏసీ అమరావతి
జిల్లా కమిటీ పిలుపు
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జిల్లాలో ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేయనున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ సంఘం సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగుల ఐక్యతను చాటుతూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు ఉంచిన ముఖ్యమైన డిమాండ్లను వివరించారు. వెంటనే పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించాలని, తక్షణమే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్‌సీ, ఎస్‌ఎల్ బకాయిలతో పాటు, నిలిచిపోయిన డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్‌ను, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా తక్షణమే వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థ్ధిక బకాయిల వివరాలను వారి పే–స్లిప్‌లోనే స్పష్టంగా చూపించాలని, పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులందరికీ వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు సరెండర్ లీవులు నగదును ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డిమాండ్ల బ్రోచర్లను ప్రదర్శించారు. సమావేశంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, చైర్‌పర్సన్ పి.ఆదిలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎస్.రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ బంగార్రాజు, అసోసియేట్ చైర్మన్ బి.సాయికుమార్, వర్క్‌చార్జ్‌డ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌రాజు, క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాల మహేష్, డి.అరుణ పాల్గొన్నారు.


