● కలెక్టర్ సమీక్షలో తేలిన వైనం
● విశాఖ ఎంపీ నిధుల పనుల్లో పురోగతి సున్నా..
విజయనగరం అర్బన్: జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన వివిధ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా అనేక పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ ల్యాడ్స్ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఈ నిశ్చల స్థితి స్పష్టంగా బయటపడింది.
ప్రకటనలకే పరిమితం..
18వ లోక్‌సభకు సంబంధించి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ నిధులతో జిల్లాలో మొత్తం 67 అభివృద్ధి పనులు మంజూరు కాగా, వాటిలో ఏకంగా 27 పనులు ఇప్పటి వరకు అసలు ప్రారంభానికే నోచుకోకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించడంలో సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక్క పనీ మొదలవ్వలేదు
మరోవైపు విశాఖపట్టణం లోక్‌సభ ఎంపీ నిధుల నుంచి జిల్లాకు నాలుగు పనులు మంజూరు కాగా వాటిలో ఒక్కటంటే ఒక్క పని కూడా కనీసం ప్రారంభం కాలేదు. ఈ పనుల పురోగతి ‘సున్నా’గా ఉండటంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు లోపల ఎలాగైనా ఈ నాలుగు పనులను కచ్చితంగా ప్రారంభించి తీరాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. రాజ్యసభ సభ్యుల నిధుల నుంచి మంజూరైన ఎనిమిది పనుల్లో కేవలం మూడు మాత్రమే పూర్తి కాగా మిగిలినవి పెండింగ్‌లోనే మూలపడ్డాయి.
ఆన్‌లైన్ అప్‌డేట్స్‌లోనూ నిర్లక్ష్యమే
పనులు సకాలంలోనే పూర్తి చేయకపోవడమే కాకుండా పూర్తయిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలోనూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు సమీక్షలో తేలింది. దీనికి కలెక్టర్ స్పందిస్తూ పూర్తయిన పనులను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని, ఒక వేళ సాంకేతిక లేదా ఇతర సమస్యల వల్ల పనులు ప్రారంభించడం సాధ్యం కాకపోతే వాటికి తగిన రిమార్కులు రాసి ఆయా పార్లమెంట్ సభ్యులకు నివేదికలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


