ఉపాధి దొరికేనా..!
ఏప్రిల్ నుంచి అమలు
విజయనగరం ఫోర్ట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే వేతనదారులకు పనులు దొరకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. అయినప్పటకీ చంద్రబాబు సర్కార్ వేతనదారులకు పనులు పూర్తి స్థాయిలో కల్పించలేకపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కంటే పని దినాలు కూడా తగ్గిపోయాయి. ఉపాధి హామీ పథకానికి అధిక శా తం కేంద్రమే నిధులు కేటాయించినప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. కేంద్రం వెచ్చించే నిధులు వాటా శాతాన్ని భారీగా తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వం వాటాను మూడు రెట్లు పెంచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వేతనదారులందరికి పూర్తి స్థాయిలో పని కల్పిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రం 40 శాతం వాటా భరించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా చొప్పన అమలు చేసేవి. ఇప్పుడు కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి వీబీజీ రామ్‌జీ పథకంగా పేరు మార్చింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం ఉపాధి హామీ పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పనులకు వెళ్లే వేతనదారులకు ఏడాదికి రూ.400 కోట్లు, మెటీరియల్‌కు మరో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు వరకు వెచ్చిస్తారు. ఇందులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలి. దీనిని అంత పెద్ద మొత్తంలో చంద్రబాబు సర్కార్ పేదల కోసం వెచ్చిస్తుందా? అనే దానిపై సర్వత్రా అనుమానాలున్నాయి.
జిల్లాలో 3.37 లక్షలు జాబ్ కార్డులు
జిల్లాలో 3.37 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,26,094 మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 5,17,126 యాక్టివ్ వేతనదారులు ఉన్నారు.
తగ్గిన పని దినాలు
చంద్రబాబు సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత వేతనదారులకు పని దినాలు తగ్గాయి. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద 2.18 కోట్ల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.502.36 కోట్లు వెచ్చించారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 1.11 కోట్ల పనిదినాలు కల్పించారు. దీనికిగాను రూ.242.64 కోట్లు వెచ్చించారు. 2023–24 సంవత్సరం కంటే 1.07 కోట్ల పనిదినాలు తగ్గాయి.
ఉపాధి హామీ పథకం ఏప్రిల్ నెల నుంచి వీబీజీ రామ్‌జీగా అమలవుతుంది. మహాత్మాగాంధీ ఉపాధి పథకంగా ఉన్నప్పుడు కేంద్రం 90 శా తం వాటా..రాష్ట్రం పది శాతం వాటాగా అమలు చేసేవి. వీబీజీ రామ్‌జీ పథకం అమలైతే కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతంగా ఉంటుంది. – ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా


