ఆక్రమణ దారుల పాగా
రామభద్రపురం: మండలంలో విలువైన స్థలాలు కబ్జాదారుల చేతుల్లోకి చేరిపోతున్నాయి.విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని పక్కా భవనాలు నిర్మించుకుంటున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదు.పంచాయతీ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పక్కాగా కట్టుకుంటున్నా కట్టుకోండి..కన్నెత్తి చూడం అన్నట్లు పంచాయతీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు.అసలు మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఏఏ శాఖలకు ఇచ్చామో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే గాని సంబంధిత అధికారులకు తెలియని పరిస్థితి.
పరిస్థితి ఇలా..
కొన్నేళ్ల క్రితం సాలూరు నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉండడం,అలాగే రామభద్రపురం మండలానికి సంబంధించి పలు శాఖలు సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉండేవి.అయితే అప్పట్లో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్షన్ కార్యాలయం నిమిత్తం మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధి,జాతీయ రహదారి పక్కన ఉన్న డి పట్టా భూమి సర్వే నంబరు 9–14 లో 2.13 ఎకరాలు రూ.కోట్ల విలువ చేసే స్థలం రెవెన్యూ అధికారులు ఇచ్చారు.అయితే ఐదేళ్ల క్రితం జిల్లా విడిపోవడంతో సాలూరు నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండగా,రామభద్రపురం మండలం విజయనగరం జిల్లాలో ఉంది.అయితే అప్పటి నుంచి అక్కడ మోటార్‌వెహికల్ ఇన్‌స్పెక్షన్ కార్యాలయం నిర్మించకపోవడం,అలాగే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రమించుకుని వ్యాపారాల కోసం ఐరన్‌తో పిల్లర్లు వేసుకుని పక్కా షెడ్లు నిర్మించుకుంటున్నారు.అలాగే పంచాయతీ అనుమతి లేకుండా పక్కాగా షెడ్లు నిర్మించుకుంటున్నా సంబంధిత అధికాకారులు కన్నెత్తి చూడడం లేదు.
ఫీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు..
నిబంధనలకు విరుద్ధంగా మోటార్ వెహికిల్ కార్యాలయానికి ఇచ్చిన స్థలం ఆక్రమణలకు గురవడం పట్ల సాలూరుకు చెందిన ప్రైవేట్ వ్యక్తులు జరజాపు లక్ష్మణరావు,మోకర సన్యాసిరావులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేయడం,అలాగే కలెక్టర్ కార్యాలయానికి గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. దీంతో పరిశీలించాలని స్థానిక తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినంత వలరకు అక్కడ డి పట్టా భూమి ఉందని తెలియదు.22ఎ రికార్డులు పరిశీలిస్తే గతంలో మోటార్ వెహికల్ కార్యాలయానికి ఆ స్థలం ఇచ్చినట్లు నమోదై ఉందన్న విషయం తెలిసింది. అలాగే సంబంధిత మోటార్ వెహికల్ అధికారులకు వారికి సంబంధించిన స్థలం ఉందన్న విషయం కూడా తెలియకపోవడం విశేషం. ఈ విషయంపై సాలూరు ఆర్టీవో ప్రసాద్, బొబ్బిలి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శశికుమార్‌లను వివరణ కోరగా జిల్లా మారిపోయిన తర్వాత సంబంధిత ఫైలు పరిశీలించలేదని, ఆ ఫైలు కమిషనర్ వద్ద ఉండే అవకాశం ఉందని తెలిపారు.అలాగే తాను కొత్తగా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చి విధులు నిర్వహించడం వల్ల పూర్తి సమాచారం తెలియదని శశికుమార్ తెలిపారు.
గతంలో ఎంవీఐ కార్యాలయానికి
డి పట్టా భూమి కేటాయింపు
2.13 ఎకరాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు
పక్కా భవనాలు, షెడ్లు నిర్మిస్తున్న
ఆక్రమణదారులు
కన్నెత్తి చూడని ఎంవీఐ అధికారులు


