ఎన్నాళ్లీ అద్దె కష్టాలు..!
అధిక శాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో... పట్టణ ప్రాజెక్ట్ పరిధిలో 317 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నవి 215 సొంత భవనాల్లో 68 సామాజిక భవనాల్లో 34 కేంద్రాలు నిర్వహణ నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లింపు
అద్దె భవనాల్లో వసతి సమస్య
స్థల సమస్య..
విజయనగరం ఫోర్ట్:
అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు తప్ప డం లేదు. సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే కేంద్రాలను నిర్వహించాల్సిన పరిస్థితి. పట్టణంలో అద్దెలు ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న గదుల్లోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీని వల్ల అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం దూరం అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి నెలకు రూ. లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇలాగే వెచ్చిస్తున్నారు. ఈ మొత్తంతో కొన్ని భవనాలు నిర్మించి ఉంటే అద్దె కష్టాలు తప్పేవని అంగన్‌వాడీలు పేర్కొంటున్నారు.
పట్టణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో 317 కేంద్రాలు
పట్టణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 317 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సొంత భవనాలు 68 మాత్రమే ఉన్నాయి. 34 కేంద్రాలు సామాజిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. 215 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 11,964 మంది చిన్నారులు
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో పిల్లలు 11,964 మంది చిన్నారులు ఉన్నారు. గర్భిణులు, బాలింత లు 3215మంది ఉన్నారు. 317 కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అంతే కాకుండా బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహిస్తారు.
ఒక్కో కేంద్రానికి రూ.4 వేల నుంచి
రూ.5 వేల వరకు అద్దె చెల్లింపు
అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు ఒక్కో దానికి రూ.వేలల్లో అద్దె చెల్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లిస్తున్నా రు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.6 వేల నుంచి రూ. 6500 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఇలా మొత్తంగా నెలకు రూ.7 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.కోటి వరకు అద్దె చెల్లిస్తున్నారు. దీనికి బదులు ఆ మొత్తంతో సొంత భవనాలు నిర్మిస్తే ఎంతో ప్రయోజమని పలువురు పేర్కొంటున్నారు.
జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహ ణకు భవనాలు అద్దెకు దొరకడం సమస్యగానే ఉంది. చిన్న చిన్న భవనాలకు సైతం అద్దె ఎక్కువగా అడుగుతుండడంతో రెండు, మూడు కేంద్రాలను ఒకే చోట నిర్వహిస్తున్నారు.దీంతో పిల్లలకు కాస్త ఇబ్బందిగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 317 కేంద్రా లు ఉన్నాయి. వీటిలో 215 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు నిర్మించడానికి స్థల సమస్య ఉంది. భవనం నిర్మించడానికి ప్రహరీతో కలిసి ఐదు సెంట్లు వరకు స్థలం అవసరం ఉంటుంది. అంత స్థలం దొరకడం కష్టంగానే ఉంది.
– కె.సత్యవతి, ఇన్‌చార్జ్ సీడీపీఓ,
విజయనగరం అర్బన్


