● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: రైతులు నిరంతర ఆదాయం పొందేందుకు పాడి పరిశ్రమ, ఉద్యాన పంటల సాగుకు అవసరమైన రుణాలు అందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఈజీపీ, పీఎంవిశ్వకర్మ, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎం సూర్యఘర్, సీసీఆర్‌సీ కార్డులు, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు, మహిళా సంఘాల రుణాలు, ముద్ర రుణాలు, పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) తదితర అంశాలపై సమీక్షించారు.
ఆవులు, గేదెలు, మెకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. నాబార్డు రూపొందించిన 2026–27కు సంబంధించిన ప్రొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ వార్షిక నివేదికను కలెక్టర్ ఆవిష్కరించారు. నాబార్డు సహాయ జనరల్ మేనేజర్ నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రూ.7,806.89 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.1,714.52 కోట్లు, ఇతర రంగాలకు రూ.2,157.20 కోట్లు రుణాలు అందించాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. సమావేశంలో మెప్మా పీడీ చిట్టిరాజు, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు, ఎల్‌డీఎం వీవీరమణమూర్తి, డీపీఓ మల్లికార్జునరావు, ఇతర శాఖల జిల్లా అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.


